‘టైటిల్ మాత్రమే మారింది.. కంటెంట్‌లో ఎలాంటి మార్పూ లేదు.. సినిమా హిట్టు ఖాయం..’ అని ఒకరు, ‘నీ పెయిన్‌ని మేం అర్థం చేసుకోగలం. నీ వెనుక మేమంతా వున్నాం..’ అని మరొకరు.. ‘వాల్మీకి’ సినిమా వివాదంపై సినీ పరిశ్రమ నుంచి, దర్శకుడు హరీష్ శంకర్‌కి మద్దతు పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు జిల్లాల్లో సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి రావడంతో, అప్పటికప్పుడు ‘వాల్మీకి’ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్ మార్పుపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన విషయం విదితమే.
ఈ విషయమై మీడియా ముందుకొచ్చిన దర్శకుడు హరీష్ శంకర్, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పంటి బిగువన ఆ బాధనంతా అనుభవిస్తూ, తాను చెప్పదలచుకున్నది చెప్పాడు. రాత్రికి రాత్రి మార్చిన టైటిల్‌తో కొత్త పోస్టర్లను థియేటర్లకు పంపించారు చిత్ర దర్శక నిర్మాతలు. అయితే, అప్పటికే ‘వాల్మీకి’ పేరుతో ప్రచారంలోకి వచ్చిన సినిమా, ఆ పేరుతోనూ జనానికి మరింత చేరువయ్యింది.
Also Read: ‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ & రేటింగ్
నిజానికి, మామూలుగా ‘వాల్మీకి’కి ఏ స్థాయి ఓపెనింగ్స్ వుంటాయో, అంతకు మించిన ఓపెనింగ్స్ ‘గద్దలకొండ గణేష్’ సొంతం చేసుకునేలా వుంది. థియేటర్ల వద్ద బీభత్సమైన హంగామా కన్పిస్తోంది. ఇదిలా వుంటే, జనసేన పార్టీకి చెందిన ట్విట్టర్ ఖాతాల్ని సస్పెండ్ చేయడం, పవన్ కళ్యాణ్ స్పందనతో, వాటిని మళ్ళీ యాక్టివ్ చేయడం తెలిసిన విషయమే. ఆ వ్యవహారానికీ, ‘వాల్మీకి’ సినిమా వ్యవహారానికీ సంబంధం వుందా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, మెగా ఫ్యాన్స్ మాత్రం రెండిటినీ ఒకేలా చూస్తున్నారు.
ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి ‘మాస్ టాక్’ దక్కించుకోవడంతో ‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ‘వాల్మీకి’ జోరు థియేటర్లలో డబుల్ అయ్యేలానే కన్పిస్తోంది. పలువురు దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు.. ‘వాల్మీకి’ అలియాస్ ‘గద్దలకొండ గణేష్’ వివాదం విషయమై దర్శకుడు హరీష్ శంకర్‌కి మద్దగా నిలవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ‘వాల్మీకి’ వివాదాల్లోకెక్కినా, సినీ పరిశ్రమను మరోసారి ఒక్కటి చేసిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
