Tollywood: మహిళను మోసం చేశాడనే ఆరోపణపై మరో తెలుగు సినీ నటుడిపై పోలీస్ కేసు నమోదైంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్టేషన్లో ఇందుకు సంబంధించి కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..
పుష్ప సినిమాతోపాటు వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, మంగళవారం, ధమాకా.. తదితర సినిమాల్లో నటించిన నటుడు శ్రీతేజ్. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీతేజ్ పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు. ఫిర్యాదు ఆధారంగా శ్రీతేజ్ పై బీఎన్ఎస్ 69, 115(2),318(2) సెక్షన్ కింద కేసు నమోదైంది. గతంలోనూ కూకట్ పల్లి పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
శ్రీతేజ్ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. డిసెంబరు 5న సినిమా విడుదల కానుంది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ ల్లోనూ శ్రీతేజ్ నటిస్తున్నాడు. ‘పరంపర’, ‘9 అవర్స్’, ‘బహిష్కరణ’ వంటి సిరీసుల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.