Tollywood: తెలుగు సినిమా గత దశాబ్దంలో ఊహించని స్థాయిలో ఎదిగింది. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే ఎక్కువగా హిందీ సినిమానే గుర్తొచ్చేది. దక్షిణాదిలోనూ తమిళ సినిమా ఆధిపత్యం ఎక్కువగా కనిపించేది. కానీ 2015లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా కేవలం బాక్సాఫీస్ విజయమే కాదు, తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా కొత్త గౌరవాన్ని తెచ్చింది. తర్వాత బాహుబలి-2తో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. పాన్ ఇండియా అనే పదానికి నిజమైన అర్థం అప్పుడే కనిపించింది. ఆ తర్వాత RRRతో రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. పుష్ప, కల్కి, సలార్, కార్తికేయ-2, హనుమాన్ వంటి చిత్రాలు ఈ స్థాయిని మరింత బలపరిచాయి. అయితే ఈ ఎదుగుదల మధ్యలోనే ఇప్పుడు మరో చర్చ మొదలైంది. తెలుగు సినిమా పరిమాణంలో పెరిగినా, ప్రణాళికలో వెనుకబడుతోందా? భారీ బడ్జెట్, పెరిగిన ఖర్చులు, ఆలస్యమైన నిర్మాణం కారణంగా గాడి తప్పుతోందా? అన్న ప్రశ్నలు పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్‌ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశాలు బడ్జెట్, టైమ్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్. చాలా సినిమాలు కథకు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చుతో నిర్మాణం మొదలుపెడుతున్నాయి. నటీనటుల పారితోషికాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.
షూటింగ్ మొదలైన తర్వాత సరైన ప్రణాళిక లేకపోవడం, తరచూ మార్పులు చేయడం, వీఎఫ్ఎక్స్ పనుల పేరుతో నెలలు కాదు, ఏళ్లు గడపడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ఫలితంగా సినిమా ఖర్చు పెరుగుతోంది. ఆ అదనపు భారం చివరికి ప్రేక్షకులపై పడుతోంది. టికెట్ ధరలు పెరుగుతున్నాయి. పెద్ద సినిమాల విడుదలలు ఎప్పుడు ఉంటాయో స్పష్టత లేక చిన్న సినిమాలు వరుసగా వాయిదాలు పడుతున్నాయి. ఒక మంచి సీజన్ పూర్తిగా ఖాళీగా పోతే, మరో సమయంలో మాత్రం వారం వ్యవధిలో మూడు నాలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ గందరగోళం వల్ల ప్రేక్షకుడు కూడా ఏ సినిమా చూడాలో, ఎప్పుడు చూడాలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదే సమయంలో చాలా మంది ఓటీటీకి అలవాటు పడుతున్నారు. ఇది థియేటర్ సంస్కృతికే సవాల్‌గా మారుతోంది. ఇక పాన్ ఇండియా అనే ట్యాగ్ ఇప్పుడు మరింత ఖరీదైనదిగా మారింది. ప్రతి సినిమాను దేశవ్యాప్త విడుదల పేరుతో భారీగా ప్లాన్ చేయడం, మార్కెట్‌కు మించిన బడ్జెట్ పెట్టడం, ప్రతి అంశాన్ని “గ్రాండ్”గా చూపించాలనే ఒత్తిడి ఇప్పుడు నిర్మాతలకే కాదు, మొత్తం ఇండస్ట్రీకి భారమవుతోంది.
దర్శకుడు బీవీఎస్ రవి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. సంచలనం సృష్టిస్తున్న ధురంధర్ సిరీస్‌కు మొత్తం ఖర్చు సుమారు రూ.260 కోట్లు మాత్రమేనని, ఆ రెండు భాగాలు కూడా ఆరు నెలల వ్యవధిలో వచ్చేశాయని ఆయన అన్నారు. అదే స్థాయి ప్రాజెక్టును తెలుగులో తీయాలంటే దాదాపు రూ.500 కోట్లు ఖర్చవుతాయని, ఏళ్ల తరబడి సెట్స్‌పైనే సినిమా ఉండిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్య టాలీవుడ్ పని తీరుపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తింది. చాలా మందికి ఇది కఠినంగా అనిపించినా, పరిశ్రమలోని వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే మాటగానే కనిపిస్తోంది. ఇటీవల సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకరవరప్రసాద్ ఇందుకు ఉదాహరణగా చెప్పబడుతోంది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో, ఎనిమిది నెలల వ్యవధిలో పూర్తి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రీజనల్ స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. సింపుల్ కథ, క్లియర్ టేకింగ్, కచ్చితమైన ప్లానింగ్ ఉంటే, పెద్ద విజయం సాధించడానికి ఏళ్ల తరబడి నిర్మాణం అవసరం లేదని ఆ సినిమా నిరూపించింది. అలాగే తేజ సజ్జా నటించిన మిరాయ్ కూడా హైదరాబాద్‌లోనే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసుకుని, పాన్ ఇండియా స్థాయిలో మంచి నాణ్యతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాంకేతికంగా, విజువల్‌గా, మార్కెట్ పరంగా తెలుగు సినిమాకు కావాల్సిన సామర్థ్యం లేదనే మాట కాదు. సమస్య ప్రధానంగా ప్లానింగ్‌లో, బడ్జెట్ కంట్రోల్‌లో, అమలు విధానంలో ఉందన్న భావన బలపడుతోంది.
మరో ముఖ్యమైన విమర్శ నటీనటుల పారితోషికాలపై వస్తోంది. ఇతర భాషల్లో తక్కువ మొత్తానికి పని చేసే కొందరు నటులకు తెలుగులో మాత్రం భారీ మొత్తాలు ఆఫర్ చేసి తీసుకొస్తున్నారనే అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. దీనివల్ల సినిమా ఖర్చు మరింత పెరుగుతోంది. ఆ తర్వాత అదే సినిమాను “భారీ బడ్జెట్” అంటూ మార్కెట్ చేసి, టికెట్ ధరలు పెంచి, ప్రేక్షకుడిపైనే ఆర్థిక భారం మోపడం జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. ప్రేక్షకులు తెలుగు సినిమాను ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నారని నిజమే. కానీ అదే అభిమానాన్ని “గ్రాంటెడ్”గా తీసుకోవడం మాత్రం పరిశ్రమకు మంచిది కాదు. “తెలుగు ప్రేక్షకులు గొప్పవాళ్లు” అని చెప్పడం ఒక వైపు ఉంటే, మరో వైపు వారిపైనే అధిక భారం మోపడం సరైన విధానం కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఎదుగుదలలో మరో కీలక దశకు చేరుకుంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. మార్కెట్ విస్తరించింది. సాంకేతికంగా బలం పెరిగింది. కానీ అదే సమయంలో క్రమశిక్షణ, సమయపాలన, బడ్జెట్ నియంత్రణ, విడుదల వ్యూహం వంటి అంశాల్లో మార్పు రాకపోతే, ఈ ఎదుగుదల స్థిరంగా ఉండకపోవచ్చు. భారీగా కనిపించడం మాత్రమే కాదు, తెలివిగా నిర్మించడం కూడా అవసరం. ప్రేక్షకుడి సమయం, డబ్బు, ఆసక్తిని గౌరవించే సినిమా నిర్మాణ సంస్కృతి రావాల్సిన సమయం ఇదే. ఈ నేపథ్యంలో ధురంధర్ వంటి ఉదాహరణలు టాలీవుడ్‌కు ఒక హెచ్చరికలా, ఒక పాఠంలా మారుతున్నాయి. తెలుగు సినిమా వెలగాలి. కానీ ఆ వెలుగు మరింత కాలం నిలవాలంటే ఇప్పుడు మారాల్సిందే.
