Tollywood: ఎక్కడైనా, ఎవరైనా తమ పరువు కాపాడుకోవాలనే చూస్తారు. వేరేవారి ముందైతే తప్పనిసరిగా కాపాడుకుంటారు. కానీ.. తెలుగువాళ్లు తమ పరువు తీసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఇతరుల ముందు పక్కోడి పరువు తీసేందుకు కూడా వెనుకాడరు. ఇదంతా నిష్టూరంలా ఉన్నా ఇదే నిజం. ఇందుకు నిదర్శనం రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై ఆ సినిమాకి పనిచేసినవాళ్లే కాకుండా పని చేయని వాళ్లు కూడా సెటైర్లు వేస్తూ కామెడీ చేయడం. అవును.. మొన్నామధ్య దర్శకుడు శంకర్, మొన్న అల్లు అరవింద్, నిన్న తమన్, నేడు దిల్ రాజు. కంకణం కట్టుకుని మరీ తెలుగు సినిమా పరువు తీసేసుకుంటున్నారు.. వాళ్లు పని చేసిన సినిమానే తక్కువ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
దర్శకులు ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కించడం దశాబ్దాల క్రితమే మానేశారు. అయినా.. అగ్ర దర్శకుడని నమ్మి రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కిస్తున్నా వందల కోట్లు ధారపోసారు దిల్ రాజు, మూడేళ్లకు పైగా కాల్షీట్లు ఇచ్చారు రామ్ చరణ్. కానీ, నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు శంకర్. మొత్తానికి సినిమా రిలీజైతే ఇంకా బాగా తెరకెక్కించేవాడ్ని అంటూ మూడో రోజునే పిచ్చి స్టేట్ మెంట్ ఇచ్చి సినిమాను ఇంకా తొక్కేశాడు సాక్షాత్తూ డైరక్టర్. సొంత మేనల్లుడని కూడా లేకుండా వేరే సినిమా ఫంక్షన్లో ‘ఓ సినిమా పడుకుం’దంటూ అవహేళనగా మాట్లాడారు అల్లు అరవింద్. పుష్ప హిట్టయితే నేను సంతోషించానని చిరంజీవి స్టేట్మెంట్ ఇస్తే తప్ప.. తప్పు తెలుసుకోలేక పోయారు మేనమామ. ఇదంతా పోతే ‘జరగండి జరగండి’ పాట చూశా, ధియేటర్లు తగలడిపోతాయ్.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి, విజువల్ వండర్ అని ఓ నాలుగు ట్వీట్లు వేసాడు సినిమా సంగీత దర్శకుడు తమన్.
రీసెంట్ ఇంటర్వ్యూలో మాత్రం తానేదో అద్భుతం ఇచ్చినట్టు.. పాట హిట్టవలేదు, కొరియోగ్రాఫర్ తప్పు, హీరో కూడా పట్టించుకోలేదంటూ నెపం వాళ్ల మీదకు తోసేసి పరువు తీసేశాడు. ఇప్పుడు సాక్షాత్తూ చిత్ర నిర్మాత దిల్ రాజు.. ఓ మలయాళ సినిమా ప్రెస్ మీట్లో.. ‘గేమ్ చేంజర్’పై కొందరు అడిగిన లేకి ప్రశ్నలకు.. ఇప్పుడెందుకా టాపిక్ అనాల్సింది.. వెకిలి నవ్వులు నవ్వుతూ అక్కడున్న వాళ్లు నవ్వేలా చేశారు. ఇదా మన సినిమాకు మనమిచ్చే వాల్యూ.. అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తిట్లు కూడా తిడుతున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమే తెలుగు గడ్డపైకి వచ్చి ప్రమోషన్ చేస్తుంటే మన సినిమా పరువు తీసుకోవడంలో పోటీపడ్డ జర్నలిస్టులదా తప్పు.. సదరు నిర్మాతదా..? ఆలోచించుకోవాల్సింది మనమే..!