క్లాస్ మేట్స్, రూమ్ మేట్స్, బెంచ్ మేట్స్ .. ఇప్పుడేమో గ్లాస్ మేట్స్ .. స్నేహానికి నిర్వచనాలు మారుతూనే ఉన్నాయి. క్లాస్ మేట్స్ కాకున్నా కూడా ఒకే రూములో ఉంటూ జీవిత లక్ష్యాలతో పాటు కష్టాలు, కన్నీళ్లు అన్ని పంచుకుంటాం మన రూమ్ మేట్స్ తో. మనలో చాలామందికి ఇలా రూమ్మేట్స్ గా ఉన్న అనుభవాలు చాలానే ఉంటాయి. జీవితంలో ఎదగాలన్న లక్ష్యంతో ఏ పల్లెటూరినుండో పట్నానికి వచ్చి .. ఇక్కడ ఇరుకు రూముల్లో జీవితాన్ని రూమ్మేట్స్ తో పంచుకోవడం .. లక్ష్యాన్ని సాధించాక అటువైపు వెళ్ళినప్పుడు ఆ జ్ఞాపకాలు ఒక్కసారి అలా గుర్తుకొస్తే అదో అనుభూతి కదా!!
రూమ్ మేట్స్ గా ఉంటూ సినిమా రంగంలో అనుకున్న గోల్ సాధించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో మొదటగా చెప్పుకోవలసింది మహానటుడిగా ఎదిగి .. తెలుగు వారి స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన అన్న ఎన్టీఆర్ కూడా చెన్నై లో మొదట్లో సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొందరితో కలిసి రూములోనే ఉండేవారు. అందులో నిర్మాత, దర్శకుడు టివి రాజు కూడా ఉండేవారట. ఇద్దరు కలిసి సినిమాలకోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన వారే.
ఇక ఆ తరువాత చెప్పుకోవలసింది క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ కూడా నటుడు సునీల్ తో కలిసి రూములో ఉన్నవారే. సునీల్, త్రివిక్రమ్ ఇద్దరు రూమ్ మేట్స్ గా కష్టాలు, కన్నీళ్లు పంచుకున్నవారే. త్రివిక్రమ్ గురించి ఏ విషయమైనా సునీల్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు స్టార్స్ గా ఇమేజ్ తెచ్చుకున్న మరికొందరి గురించి ఓ లుక్కేద్దాం..
మెగాస్టార్ చిరంజీవి కూడా కెరీర్ ప్రారంభంలో చెన్నై లో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసేందుకు రూములోనే ఉన్నాడు. ఆయనతో పాటు ఆ రూములో కమెడియన్ సుధాకర్ కూడా ఉన్నాడు. నిజానికి హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టిన సుధాకర్ ఆ తరువాత కమెడియన్ గా మారాడు. అయితే చిరంజీవి మాత్రం మెగాస్టార్ గా ఎదిగాడు.
ఇక దర్శకుడు శ్రీనువైట్ల కూడా తన మిత్రులతో రూమ్ మేట్స్ గా ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆయన రూమ్ మేట్స్ ఎవరో కాదు నిర్మాత అనిల్ సుంకర. ఇద్దరు కలిసి చెన్నై లో ఒకే రూములో ఉండేవారు. శ్రీను వైట్ల దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెడితే అనిల్ సుంకర మాత్రం సాఫ్ట్ వేర్ కోర్స్ చేసేవాడట. ఆ తరువాత శ్రీను వైట్ల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకుంటే అనిల్ సుంకర అమెరికా వెళ్లి అక్కడ సాఫ్ట్ వెర్ బిజినెస్ లో బాగా రాణించి తరువాత 14 రీల్స్ తో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. తన మిత్రుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు తో దూకుడు, వెంకటేష్ తో నమో వెంకటేశా సినిమాలు చేసాడు.
ఇక మాస్ రాజా రవితేజ కూడా తన రూమ్ మేట్స్ తో కలిసి సినిమాల్లోనే ప్రయత్నాలు సాగించి అందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే. రవితేజ తో పాటు చెన్నై లో రూములో ఉన్న ఆ మిత్రులు ఎవరో కాదు .. దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి, దర్శకుడు గుణశేఖర్. ఈ ముగ్గురు చాలా సీరియస్ గా సినిమా ప్రయత్నాలు చేశారట. సినిమాల్లో సక్సెస్ అయ్యాక ముగ్గురం కలిసి ఓ సినిమా చేయాలనీ అప్పుడే నిర్ణయం తీసుకున్నారట . ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని వర్కవుట్ చేసారు. అదే నిప్పు సినిమా. గుణశేఖర్ దర్శకత్వంలో వై వి ఎస్ చౌదరి నిర్మాతగా రవితేజ హీరోగా వచ్చిన ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఇప్పటికే అదే స్నేహభావంతో ఉన్నారు.
హీరోలు, దర్శకులే కాదండోయ్ .. హీరోయిన్స్ కూడా ఒకే రూములో ఉంటూ ప్రయత్నాలు సాగించిన వారు ఉన్నారు. అందులో బాలీవుడ్ లో అయితే వాణి కపూర్, రాశి ఖన్నా ఇద్దరు ఒకే రూములో ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారన్న విషయం మీకు తెలుసా. మందు మోడలింగ్ చేస్తూ ఆ తరువాత హీరోయిన్స్ గా నిలదొక్కుకున్నారు ఇద్దరు. వాణి కపూర్ బాలీవుడ్ లో సెటిల్ అయితే .. రాశి ఖన్నా సౌత్ లో సెటిల్ అయింది.
అలాగే క్రేజీ దర్శకుడు పూరి జగన్నాధ్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కూడా ఇద్దరు రూమ్ మేట్స్. పూరి జగన్నాధ్ దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాక తన మిత్రుడు రఘు కుంచెకు ఓ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇక క్రియేటివ్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చ్చుకున్న కృష్ణవంశీ, నటుడు ఉత్తేజ్ కూడా ఒకే గదిలో ఉన్నవారన్న సంగతి మీకు తెలుసా. వీరిద్దరూ రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యులుగా చేసారు .. అసలు కృష్ణవంశీ దర్శకుడు కావడానికి ఉత్తేజ్ హెల్ప్ చేసాడట. ఆ తరువాత కృష్ణవంశీ ప్రతి సినిమాలో ఉత్తేజ్ పాత్ర ఉండడం సహజమే.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా .. ప్రముఖ దర్శకుడు భారతి రాజా కూడా ఇద్దరు రూమ్ మేట్స్ అన్న విషయం ఎంతమందికి తెలుసు. వారిద్దరూ ఇప్పుడు లెజెండ్స్ గా సినిమా రంగంలో ఖ్యాతి తెచ్చుకున్నవారే. అలాగే హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి, దర్శకుడు సుధీర్ ముగ్గురు ఒకే రూమ్ మేట్స్. సినిమా రంగంలో కలిసి ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిఖిల్ హీరోగా మారితే .. చందు, సుధీర్ ఇద్దరు దర్శకులయ్యారు. అలాగే రైటర్ గోపి మోహన్, దర్శకుడు వీరు పోట్ల, సుధాకర్ రెడ్డి ముగ్గురు కూడా ఒకే రూములో ఉండేవారట. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది కనిపిస్తారు. ఒకే లక్ష్యం కోసం ఒకే రూమును పంచుకున్న వీరందరూ తమ తమ లక్ష్యాలను సాధించుకుని ఉన్నత స్థానంలో నిలదొక్కుకున్నారు.