Tollywood: ప్రస్తుతం భారతీయ సినిమాలో అగ్రతాంబూలం దక్కుతోంది తెలుగు చిత్ర పరిశ్రమకే. దక్కుతుంది.. అనడం కంటే దక్కించుకుంది అనడం కరెక్ట్. అంతగా తెలుగు సినిమా వెలుగుతోంది. రూట్స్ లో కథ, హీరోయిజం, ఎలివేషన్లు, భారీ నిర్మాణం, ప్రేక్షకుల ఆదరణ.. ప్రతి భాషా చిత్రపరిశ్రమను తెలుగు వైపు చూసేలా చేస్తున్నాయి. స్టార్ హీరో సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడం గమనించాల్సిన అంశం. ఇంతగా తెలుగు సినిమాకు ఆదరణ దక్కుతున్నా ఇంకా ఎక్కడో వెలితి కనిపిస్తూనే ఉంది. అది.. సినిమా టైటిల్స్ విషయంలో. తెలుగు పరిశ్రమను, తెలుగు ప్రేక్షకుల్ని తేలిగ్గా తీసుకోవడం వల్లే ఇదంతా అని సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. అయితే..
తెలుగులో నిర్మితమై, తెలుగులోనే తెరకెక్కే సినిమాల టైటిల్స్ లో కూడా కొత్త కోణాలు చూడటం ఆశ్చర్యకరం. సెన్సార్ బోర్డు చెప్తున్న మార్పులు, చెప్తున్న కట్స్ నిజంగానే విడ్డూరంగా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా.. ఇటివల సుహాస్ హీరోగా వచ్చిన ‘హే భగవాన్’ సినిమా టైటిల్ ను ‘హే బలవంత్’గా మార్పించేసింది. ‘ఛాయ్ వాలా’ టైటిల్ ను కొందరిని ఉద్దేశించినదిగా రాజకీయ దుమారం రేగుతుందని ‘నవాబ్ కేఫ్’గా, ‘వానర’ టైటిల్ ను ‘వానవీర’గా మార్చేలా చేసింది. ఎవరివో మనోభావాలు దెబ్బతింటాయని తెలుగు సినిమా టైటిల్స్ మార్పిస్తున్న సెన్సార్ బోర్డు.. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయ్యే సినిమాల విషయంలో ఎందుకు లైట్ తీసుకుంటుందో కారణం వారే చెప్పాలి. ముఖ్యంగా..
ఆమధ్య తెలుగులోకి వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమాల టైటిల్స్ ను చూస్తే.. తంగలాన్, వేట్టయాన్, కంగువ, వాలిమై, అయలాన్.. ఇలా ఉన్నాయి. అసలు వీటి అర్ధం తెలుగు ప్రేక్షకులకి తెలుసా. ఎందుకు సన్నివేశాలకి, తెలుగు సినిమా టైటిల్స్ కి అడ్డు చెప్పే సెన్సార్ బోర్డు ‘తమిళ డబ్బింగ్ సినమాలకు టైటిల్స్ తెలుగులోనూ అవే పెడుతుంటే మాత్రం అడ్డుకోదు..’ అనేది సోషల్ మీడియాలో ఎప్పుడూ జరిగే చర్చే. తెలుగు చిత్ర పరిశ్రమంలే అంత చిన్నచూపా.. తెలుగు ప్రేక్షకులంటే లోకువా? వీటికి సమాధానం సెన్సారో బోర్డు చెప్పదు.. తమిళ సినిమాలు డబ్బింగ్ చేసే నిర్మాణ సంస్థలూ చెప్పవు. ‘తెలుగులోనే కదా.. చూసేస్తారులే.. వాళ్లకు పట్టింపు ఉండదులే’ అనే లోకువ మేకర్స్ లోనే ఉందా..? ఏంటో అర్ధం కాదు.
