దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది.
వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి టీటీడీ అడ్డగోలుగా వ్యవహరించిందనీ, అప్పటి టీటీడీ బోర్డు, అధికార పార్టీ కనుసన్నల్లో తిరుమల పవిత్రతను చెడగొట్టేలా వ్యవహరించిందనీ, అధికారులు సైతం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో అక్రమాలకు పాల్పడ్డారనీ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
తిరుపతి లడ్డూ కల్తీ గురించి తొలుత సీఎం చంద్రబాబునాయుడు సంచలన ప్రకటన చేయగా, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులందరి దృష్టికి తీసుకెళ్ళారు.
ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని’ ఏర్పాటు చేయగా, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు కోర్టును ఆశ్రయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’లో కేంద్ర ప్రభుత్వానికీ భాగం వుండేలా సుప్రీంకోర్టు, కొత్త సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం పలు కోణాల్లో విచారించి, తాజాగా నలుగురు నిందితుల్ని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అరెస్టయినవారిలో బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్ (ఉత్తరాఖండ్), శ్రీ వైష్ణవీ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అపూర్వ చావడా, ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్ తదితరులు అరెస్టయ్యారు.
‘సిట్’ బృందం పైన పేర్కొన్న నిందితుల్ని విచారించినప్పుడు, పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
గత కొద్ది రోజులుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, కొందరు వైసీపీ నేతలు.. తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి, సిట్ బృందం ఎటూ తేల్చడంలేదనీ, సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు కొట్టివేయనుందనీ పుకార్లు పుట్టించిన విషయం విదితమే.
ఇంతలోనే, ఈ కేసులో నిందితుల అరెస్టు వెలుగులోకి రావడం గమనార్హం. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందన్నది నిర్వివాదాంశం. ఇది తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్న ప్రతి భక్తుడికీ తెలుసు.
టెండర్లలో అక్రమాల్ని సిట్ వెలుగులోకి తీసుకొస్తోంది. అసలంటూ టన్నుల కొద్దీ నెయ్యి సరఫరా చేసే స్థాయి లేని బోలేబాబా డెయిరీకి ఎలా కాంట్రాక్టు వెళ్ళింది.? ఈ అక్రమ ఒప్పందాల వెనుక ఎవరున్నారన్నదానిపై నిజాలు నిగ్గు తేలాల్సిందే.
అరెస్టయినవారు జస్ట్ పావులు మాత్రమే, ఆ పావులు కదిపిన పెద్దల లెక్క తేలాల్సి వుంది. పెద్దలు కాదు, అవి వైసీపీ గద్దలు.. అన్నది బహిరంగ రహస్యం.
ఐదేళ్ళలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించిన వైసీపీ, తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిందన్న విషయంలో వెంకన్న భక్తులకు రెండో అభిప్రాయమే లేదు.!