తాడేపల్లి లో ఏర్పాటుచేసిన వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో చర్చించారు. అధికారం కోల్పోయినప్పుడు కష్టాలు తప్పవని చెప్పిన ఆయన.. ఈసారి జగన్ 2.0 ని చూపిస్తానని వ్యాఖ్యానించారు. తొలి విడత గెలిచినప్పుడు జనాల కోసం తాపత్రయపడ్డానని ఈసారి మాత్రం కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని అన్నారు. జనాలకు మంచి చేసే సమయంలో కార్యకర్తలకు కొద్దిపాటి అన్యాయం జరిగిన విషయం వాస్తవమేనని కానీ ఈసారి తన పరిపాలన వేరే లెవెల్ లో ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కథను గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. తనపై టీడీపీ – కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టినప్పుడు వాటిని తట్టుకుని ఎలా బయటపడ్డానో ఇప్పటికీ అదే ఆత్మవిశ్వాసం తనలో ఉన్నట్లు చెప్పారు. ప్రజలు అంతా గమనిస్తూ ఉంటారని.. తనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడితే.. తిరిగి వచ్చి ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యానని తెలిపారు.
కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ గురించి అడుగుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం బయటకు తీస్తోందని ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తించుకోవాలని అన్నారు. కార్యకర్తలపై ఇప్పుడు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.