అదిగో చెట్లు నరికేస్తున్నారు.. ఇదిగో ఆరోగ్యశ్రీని లేపేశారు.. ఇలా నడుస్తోంది సోషల్ మీడియా వేదికగా వైసీపీ దుష్ప్రచారం. ‘ఫ్యాక్ట్ చెక్’ అంటూ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం, వైసీపీ దుష్ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నా, వైసీపీ నుంచి నడుస్తున్న ఫేక్ ప్రచారం మాత్రం ఆగడంలేదు.
ఇటీవల వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య పాత గొడవల కారణంగా జరిగిన హత్య దగ్గర్నుంచి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ కట్టుకున్న మాజీ జవాన్ విషయంలో అధికారులు అనుసరించిన వైఖరి వరకు.. అన్నింటిలోనూ వైసీపీ దుష్ప్రచారం సుస్పష్టం.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, కొన్ని చెట్ల నరికివేత విషయమై జరిగిన దుష్ప్రచారంపై జిల్లా కలెక్టర్ స్పందించాల్సి వచ్చింది. అయినా, అక్కడ దుష్ప్రచారం ఆగలేదు. ఆ చెట్లు మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిసి, వాటి నరికివేతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మన దేశంలో ఈ చెట్లను గతంలోనే నిషేధించారు. కానీ, రాష్ట్రంలో యధేచ్ఛగా ఆ చెట్లను పెంచుతూ వచ్చారు గతంలో.
చెప్పుకుంటూ పోతే, వైసీపీ దుష్ప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. ఆ పథకం ఎత్తేశారట, ఇక్కడ ఇలా దోపిడీ జరుగుతోందిట.. ఇదీ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తీరు.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి పూర్తిగా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే, వైసీపీ దుష్ప్రచారం అత్యంత ప్రమాదకరంగా మారింది. మామూలుగా అయితే, మూడు నుంచి ఆరు నెలలపాటు కొత్త ప్రభుత్వంపై విమర్శలకు విపక్షాలు సమయం తీసుకుంటాయి.
కానీ, వైసీపీ అలా కాదు.. ఓడిపోయిన మరుక్షణం నుంచీ దుష్ప్రచారం తీవ్రతను కొనసాగిస్తూనే వుంది. వాస్తవానికి వైసీపీ అధికారంలో వున్నప్పుడూ దుష్ప్రచారమే చేసింది, ఇప్పుడూ అదే చేస్తోంది. వైసీపీ దుష్ప్రచారం, సమాజంలో అలజడికి కారణమయ్యే ప్రమాదం వుంది. ఈ ప్రమాదాన్ని ఆదిలోనే తుంచెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. నిజానికి, ఇదొక పెను సవాల్‌గా మారింది కూటమి ప్రభుత్వానికి.