ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ‘మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం..’ అని ప్రస్తుత ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిపై హెచ్చరికలు చేస్తోంటే, అధికారంలో ఇప్పుడున్నవాళ్ళు ఏం చెయ్యాలి.?
అంటే, వైఎస్ జగన్ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకుని, కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఇప్పటికిప్పుడు కక్ష సాధింపు చర్యలు షురూ చేయాలన్నమాట. ‘ప్రతీదీ గుర్తు పెట్టుకోండి.. వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం..’ అని వైసీపీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం, ఇప్పటిదాకా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. ఒకవేళ కక్ష సాధింపు చర్యల్ని కూటమి ప్రభుత్వం మొదలు పెడితే, ఈపాటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో వుండాలి. ఎందుకంటే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ‘స్కిల్ డెవలప్మెంట్ స్కామ్’ అంటూ, లేని స్కామ్‌ని చంద్రబాబు మీద బలవంతంగా రుద్ది, జైలుకు పంపించారు వైఎస్ జగన్.
నారా లోకేష్‌ని అరెస్టు చేయించడానికి వైఎస్ జగన్ అప్పట్లో చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. జనసేనాని పవన్ కళ్యాణ్ మీద కూటా కుట్రపూరిత వ్యవహారాలు చాలానే నడిపారు వైఎస్ జగన్. ఓ దశలో పవన్ కళ్యాణ్‌ని విశాఖలో అరెస్టు చేయించేందుకు జగన్ చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అవి బెడిసి కొట్టాయి.
వైసీపీ హయాంలో టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు..ప్రజల తరఫున నినదించే పరిస్థితే వుండేది కాదు. ఏ పార్టీ అయినా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే, పోలీసులు అడగుడుగునా ఆటంకాలు సృష్టించడం చూశాం. హౌస్ అరెస్టులు సర్వసాధారణం. జగన్ హెలికాప్టర్‌లో వెళుతోంటే, కింద రోడ్డు మీద ట్రాఫిక్ నిలిపేసిన ఘటనలూ లేకపోలేదు.
వాటన్నిటికన్నా దారుణమైన విషయం, ముఖ్యమంత్రిగా జగన్ వున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా క్యాంప్ కార్యాలయం దగ్గర నిరసన తెలిసిన విద్యార్థుల మీద అత్యాచారయత్నం కేసులు పెట్టిన ఘనత అప్పటి పోలీసు యంత్రాంగానిది.
అంతలా దుర్మార్గ పాలన చేసి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలపై వైఎస్ జగన్ ‘మేం అధికారంలోకి వచ్చాక మీ అంతు తేలుస్తాం..’ అని హెచ్చరిస్తున్నారంటే, జగన్ హెచ్చరికను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిందే.
‘జగన్ మళ్ళీ గెలిచేది లేదు.. అతని తాటాకు చప్పుళ్ళకు బెదరం..’ అని కూటమి ప్రభుత్వం లైట్ తీసుకుంటే కష్టం. ఎందుకంటే, అధికారంలో లేకపోయినా, వైసీపీ ‘వ్యవస్థల్ని’ మేనేజ్ చేయగలుగుతోందన్న ఆవేదన కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తల మీద వుంది.
‘కొన్ని చోట్ల పోలీసులు వైసీపీ నేతల మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ టీడీపీ, జనసేన బీజేపీకి చెందిన కింది స్థాయి నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వ పెద్దలు ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇలా బెదిరింపుకు దిగడం మాత్రం అత్యంత దారుణం.! చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణ పరాజయాన్ని చవిచూశాక కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్; రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించడాన్ని ఏమనుకోవాలి.?