ఇప్పుడు టాలీవుడ్ లో దుమారం రేపుతున్న జానీ మాస్టర్ కేసుపై ఒక్కొక్కరుగా అందరూ స్పందిస్తున్నారు. ఇక ఇండస్ట్రీ తరఫున ఫిల్మ్ ఛాంబర్స్ అసోసియేషన్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది. బాధితురాలు తమకు ముందే ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 2018లో తాము ఏర్పాటు చేసిన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ లో సదరు బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. మహిళా కొరియోగ్రాఫర్ నుంచి వచ్చిన ఫిర్యాదును తాము స్వీకరించామని.. ఈ కేసును పరిష్కరించడానికి కమిటీని వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నట్టు వారు తెలిపారు.
ఇక జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి కూడా ఈ కేసు విచారణ తేలే వరకు తొలగిస్తున్నట్టు ప్రకటించింది ఫిల్మ్ ఛాంబర్స్. ఇక తాము ఏర్పాటు చేసిన కమిటీలో K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్ గా.. ఝాన్సీ చైర్‌పర్సన్ గా ఉన్నట్టు తెలిపారు. వీరితో పాటు అంతర్గత సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది ఉన్నారు. ఇక బాహ్య సభ్యులుగా రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త మరియు మీడియా నిపుణురాలు ఉన్నారు. ఆమెతో పాటు లాయర్ కావ్య మండవ కూడా ఉన్నారు.
ఇక మీదట కూడా ఇండస్ట్రీలో ఎవరికైనా మహిళలకు ఇబ్బందులు కలిగితే ఈ ప్యానెల్ కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం బయట ఫిర్యాదుల పెట్టె ఉంటుందని.. దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చని వారు తెలిపారు. ఒకవేళ ఇక్కడి వరకు వచ్చి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని వారు పోస్టు ద్వారా కూడా పంపొచ్చని వారు తెలిపారు.