కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా తెలుగు దేశం పార్టీకి సంస్థాగత నిర్మాణం బలంగా ఉంది. కోటి సభ్యత్వాలతో టీడీపీ చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే.
పార్టీ కష్టంలో ఉన్న సమయంలో వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు సాయం చేసేందుకు, వారికి ఉన్న సమస్యల పరిష్కారానికి తెలుగు దేశం పార్టీ అధినాయకత్వం సిద్ధం అయింది. నియోజక వర్గాల్లో ప్రతి బుధవారం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించబోతున్నారు. అందుకోసం ప్రణాళిక సిద్ధం చేశారు. త్వరలోనే పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ కార్యకర్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలి. వారిని అడిగి మరీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి గ్రివెన్స్ స్వీకరించాలి. మధ్యాహ్నం నుంచి నియోజక వర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారంకు కృషి చేయాలని సూచించారు. దీంతో పార్టీపై కార్యకర్తలకు మరింత నమ్మకం పెరిగే అవకాశం ఉందని, తద్వారా పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందని నాయకత్వం భావిస్తుంది.