Vemula Veeresham : టెక్నాలజీ పెరిగినా కొద్ది సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగి పోతున్నాయి. ఒకప్పుడు పెద్దగా చదువుకోని వారిని మోసగించిన సైబర్ నేరస్తులు ఇప్పుడు ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిని సైతం ఈజీగా మోసం చేస్తున్నారు. ఆ మధ్య డిజిటల్ అరెస్ట్ అంటూ ఎంతో మందిని సైబర్ నేరగాళ్లు ఇబ్బంది పెట్టి, కోట్ల రూపాయలను లాగేసిన వైనం అందరికి తెలిసిందే. ఈమధ్య సైబర్ నేరాల గురించి ఎక్కువగా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది.
సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటూ జనాలకు సూచనలు చేస్తున్నారు. దాంతో జనాల్లో కొంత మేరకు అవగాహణ వచ్చింది. అయినా సైబర్ నేరగాళ్లు మాత్రం కొత్త పద్దతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఏకంగా ఒక ఎమ్మెల్యేను న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారు. డబ్బులు డిమాండ్ చేసిన నేరగాళ్లపై సదరు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ న్యూడ్ వీడియోను వాట్సాప్ ద్వారా పంపించారు. సోషల్ మీడియాలో ఉన్న వేముల వీరేశం ఫోటోలను కాపీ చేసి, వాటితో న్యూడ్ వీడియోలను ఎడిట్ చేసిన దుండగులు వాటిని వీరేశంకు పంపించి బ్లాక్ మెయిల్ చేశారు. తాము డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
