ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగజారుడుతనం తో వ్యవహరిస్తుంది అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నీటి వినియోగం కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కృష్ణ బోర్డు కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ విషయమై మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ పై విధంగా మాట్లాడాడు. జగన్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులో అసలు అర్థం లేదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తెలంగాణ ప్రభుత్వం సాగర్ జలాలను వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అనడంలో నిజం లేదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలియజేశారు. అబద్ధపు ప్రచారం చేస్తూ కృష్ణ బోర్డు వద్ద తెలంగాణా పై ఫిర్యాదు చేయడం అవివేకం అంటూ ఆయన ఆరోపించాడు. పవర్ గ్రిడ్ ను కాపాడుకునేందుకు నీటిని ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే వాడుతున్నట్లు గా ఆయన తెలియ జేశాడు. శ్రీశైలం నుండి విద్యుదుత్పత్తిని తాము ఆపేసినా ఏపీ మాత్రం ఇంకా కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నాడు. పైగా తమ పై కృష్ణ బోర్డుకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉంది అంటూ జగదీశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు.