చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల ముందే రావడం గమనార్హం. ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు, విడుదలైన తొలి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాకు మాత్రం చివరి వరకూ అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ కారణం గా మేకర్స్ ముందుగానే అప్రమత్తం అయ్యారని తెలుస్తోంది. దీనివల్ల అభిమానులకు, థియేటర్ ల యాజమానులకు టెన్షన్ తగ్గినట్లే. మొన్న ఏర్పడిన గందరగోళ పరిస్థితులు ఇప్పుడు లేకుండా చేయటం పెద్ద ఊరట అనే చెప్పాలి. ఈ విషయం లో మేకర్స్ ను అభిననంది చాల్సిందే.
అయితే.. దీంతో తెలంగాణలో సినిమా టికెట్ ధరల అంశం మరోసారి చర్చకు దారితీసింది. టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ వైఖరి సమానంగా ఉండాలన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పెద్ద హీరోల సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల అంశం ప్రేక్షకులపై భారం కాకుండా, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా బలపడుతోంది. ఈ పరిణామాలతో తెలంగాణలో సినిమా టికెట్ ధరల పాలసీపై మరోసారి విస్తృత చర్చకు ఆస్కారం ఏర్పడింది.
