తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూండగా.. ఇందుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడం కాక రేపుతోంది. దీంతో అధికార వర్గాల్లో ఆందోళన నెలకొంది. గవర్నర్ సమ్మతి తర్వాతే బడ్జెట్ ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. తర్వాత మండలిలో ప్రవేశపెడతారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ప్రతులను కూడా మూడు రోజుల కిందటే గవర్నర్ కార్యాలయానికి పంపించారు. అయితే.. గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈక్రమంలో ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దువే వాదనలు వినిపించనున్నారని తెలుస్తోంది. ఇటివల రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం.. గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ తీరుపై వ్యాఖ్యలు చేయడం తెలిసిన విషయమే.