ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చేశాయ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. ఒకే ఒక్క సంస్థ తప్ప, మిగతా సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టేస్తూ ఎగ్జిట్ పోల్ అంచనాల్ని వెల్లడించేశాయ్. బీఆర్ఎస్ రెండో స్థానంలో వుంటుందనీ, బీజేపీ ప్రభావం పెద్దగా లేదనీ ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.
నిజమేనా.? ఇలాగే జరుగుతుందా.? అంటే, ఆ అంచనాలన్నీ పటాపంచలైపోతాయ్.. తమదే తిరిగి అధికారం.. అని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అంటున్నారు. హ్యాట్రిక్ కొట్టి తీరతామని కుండబద్దలుగొట్టేశారు. అయితే, ఆ కుండబద్దలుగొట్టేయడంలో ఆత్మవిశ్వాసం లోపించింది కేటీయార్‌కి.
ఇక, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంగతి వేరు. అధికారంలోకి తామే వస్తామంటూ, ఎగ్జిట్ పోల్ అంచనాలపై మురిసిపోతున్నారాయన. అదే సమయంలో, ‘అధికారం, ప్రతిపక్షం.. రెండూ తెలంగాణ సమాజానికి అవసరం.. గెలిచినోడు గొప్పోడు కాదు.. ఓడినోడు తక్కువోడూ కాదు..’ అంటూ ఏదో వేదాంతం చెప్పారాయన.
రేవంత్ రెడ్డిలో ఈ మార్పు చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ముందుకెళ్ళాలనీ, ముందు ముందు పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఏమైనా ప్లాన్ చేసిందేమో.! రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.
కామారెడ్డిలో కేసీయార్ ఓడిపోవచ్చనీ, గజ్వేల్‌లో బొటాబొటి మెజార్టీతో కేసీయార్ గెలుస్తారనీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇది ఒకింత ఆసక్తికరం. హుజూరాబాద్‌లో ఈటెల గెలుస్తారుగానీ, బొటాబొటి మెజార్టీ.. అంటున్నారు.
మొత్తమ్మీద, ఎగ్జిట్ పోల్ అంచనాలే డిసెంబర్ 3 వరకూ తెలంగాణలో హాట్ టాపిక్ అవుతాయి. ఆ రోజు సాయంత్రం వచ్చే ఫలితాలతో, తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారన్నది తేలిపోతుంది. ఈలోగా ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
I read this piece of writing fully about the resemblanceof most recent and previous technologies, it’s remarkable article.