తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఎగ్జిబిటర్ సభ్యుల సమావేశంలో నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వారు ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో నిర్మాత తండ్రిలాంటి వాడైతే, ఎగ్జిబిటర్ బిడ్డలాంటివాడని అన్నారు. తండ్రి ఎంత కష్టపడినా బిడ్డల సుఖం కోసమే కష్టపడతాడని, అలాగే పరిశ్రమలో ఎగ్జిబిటర్ల పరిస్థితి మెరుగుపడితేనే ఇండస్ట్రీ కూడా బాగుంటుందని చెప్పారు. గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గత ఆరు నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లను బ్రతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం చాలా అవసరమని అన్నారు. థియేటర్ల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి వంటి వారికి నిర్మాతగా తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. పర్సెంటేజ్ విధానం కోసం చేస్తున్న పోరాటాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. ఇది ఏ సినిమా లేదా నిర్మాతను టార్గెట్ చేయడం కాదని, కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నమని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పర్సెంటేజ్ విధానం అమలులో ఉండగా, తెలుగులో మాత్రం రెంటల్ విధానంలో సినిమాలు విడుదల చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎగ్జిబిటర్ల పరిస్థితిని మరో కోణంలో చూడవద్దని, థియేటర్లను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రేక్షకులకు టికెట్ రేట్లు పెంచే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేశారు.
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. పర్సెంటేజ్ విధానం కోసం 2008 నుంచే పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ‘హరిహర వీరమల్లు’ విడుదల సమయంలో కూడా ఈ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చినా అది జరగలేదన్నారు. థియేటర్లు బంద్ చేస్తున్నామని జరుగుతున్న ప్రచారం అసత్యమని, పర్సెంటేజ్ ఇచ్చే సినిమాలను మాత్రం ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. గీత, వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, మరికొన్ని సంస్థలు కూడా త్వరలో ఈ విధానంలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలులో ఉందని, తమకు ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. అయితే పర్సెంటేజ్ విధానం లేకపోతే థియేటర్లను నడపడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఇది చాలా సీరియస్ సమస్య అని అన్నారు. పర్సెంటేజ్ విధానం అమలు చేస్తామని చెబుతున్నా, ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని పేర్కొన్నారు. నిర్మాతలు కూడా ప్రస్తుతం నష్టాల్లోనే ఉన్నారని చెప్పారు. మల్టీప్లెక్సుల్లో ఆధునిక టెక్నాలజీలు, కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అలాంటి మార్పులు తీసుకురాలేకపోతున్నామని తెలిపారు. డాల్బీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సింగిల్ స్క్రీన్స్‌కి వస్తారని చెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోతారని హెచ్చరించారు. చాలా ఏళ్లుగా ఈ సమస్యను నిర్మాతల దృష్టికి తీసుకెళ్తున్నామని, హామీలు మాత్రమే వస్తున్నాయని అన్నారు. అందుకే ఈ సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. మీడియా కూడా థియేటర్ల పరిరక్షణ కోసం తమకు సహకరించాలని కోరారు.
