రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.! ఎవరు గెలవబోతున్నారన్నదానిపై రేపు మధ్యాహ్నం.. అంటే, డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకే ఓ స్పష్టత వచ్చేస్తుంది. ఎర్లీ ట్రెండ్స్ అనుకుంటే, పదిన్నర గంటల సమయానికి ఓ అవగాహన వచ్చేస్తుంది ఎవరు గెలుస్తారన్నదానిపై.
మేమే గెలుస్తామంటోంది కాంగ్రెస్. కాదు, తామే గెలుస్తామంటోంది గులాబీ పార్టీ. హంగ్ వస్తుందన్నది బీజేపీ ఉవాచ.! బీజేపీ, హంగ్ ప్రభుత్వాన్ని కోరుకుంటోందన్నది సుస్పష్టమైపోయింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ‘హంగ్’ అవకాశాలు చాలా చాలా తక్కువ.
అలాగని, వేవ్ ఒకే పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడేలా కనిపించడంలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా, బొటాబొటి మెజార్టీతోనే గెలవొచ్చు. గులాబీ పార్టీ గెలిచినా అదే పరిస్థితి. ఎన్నికల్లో ‘డబ్బు పంపిణీ’ చాలా కీలక పాత్ర పోషించిందన్నది బహిరంగ రహస్యం.
ఇక, కౌంటింగ్ కంటే ముందే ‘కొనుగోళ్ళు’ షురూ అయ్యాయంటూ తెలంగాణ రాజకీయాల్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతోంది. గెలిచే అవకాశం వున్న నాయకుల్ని, ఎగ్జిట్ పోల్ సర్వేల ఆధారంగా ప్రధాన రాజకీయ పార్టీలు ‘పిక్’ చేస్తున్నాయట.. అదీ పార్టీలకతీతంగా.
ఎవరెక్కువ కోట్ చేస్తే, వాళ్ళకే అమ్ముడుపోయేందుకు కొందరు అభ్యర్థులూ సిద్ధంగా వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. రాజకీయమంటేనే అమ్మకాలు, కొనుగోళ్ళు.. ఇదొక వ్యాపారంగా మారిపోయింది ఇటీవలి కాలంలో.
ఎన్నికలంటే మాటలా.? కేంద్ర ఎన్నికల సంఘం విధించే నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తే కుదరదిక్కడ. ఆ ఖర్చు అస్సలు పనికిరాదు. అంతకు మించి ఎన్నో రెట్లు ఖర్చు చేస్తే తప్ప, ఓటర్లను మెప్పించలేరు అభ్యర్థులు. అంత ఖర్చు చేశాక, లాభం అంటూ వుండాలి కదా.? అదీ అసలు సంగతి.
ఓ డజను మంది అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి అప్పుడే గులాబీ పార్టీతో టచ్‌లోకి వెళ్ళిపోయారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. అదే గులాబీ పార్టీ గెలుపు ధీమాకి కారణమట.!