సోషల్ మీడియాని ఎంత ఛండాలంగా రాజకీయ పార్టీలు వాడుతున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.! కండోమ్ ప్యాకెట్లతో వైసీపీ నిస్సిగ్గు రాజకీయానికి తెరలేపింది. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో టీడీపీ అంతకన్నా దారుణంగా దిగజారిపోయింది.
‘తమ పార్టీ ప్రచారం కోసం చివరికి ప్రజలకు కండోమ్‌లు కూడా పంపిణీ చేస్తోంది టీడీపీ. ఇదెక్కడి ప్రచార పిచ్చి? నెక్స్ట్ వయాగ్రాలు కూడా పంచుతారేమో? కనీసం అక్కడితోనైనా ఆగుతారా? లేకపోతే మున్ముందు ఇంకా దిగజారుతారా.?’ అని ప్రశ్నిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని ట్యాగ్ చేసింది వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్.
ఇంకా దిగజారుడుతనమేంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుని కూడా వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ ట్యాగ్ చేయడం.
దీనికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, టీడీపీ కూడా ఇలాంటి ట్వీట్‌నే వేసింది. ఆయా వీడియోల్లో కొందరు వ్యక్తులు టీడీపీ తరఫున కండోమ్‌లను పంచినట్లు, వైసీపీ తరఫున కండోమ్‌లు పంచుతున్నట్లు కనిపిస్తోంది.
వీటిని ఐ-ప్యాక్ తెలివితేటలుగా టీడీపీ ఆరోపిస్తోంది. అలా ఆరోపించినప్పుడు, అదే పని టీడీపీ అస్సలు చెయ్యకూడదు కదా.?
ఇక, ప్రచార పిచ్చి గురించి మాట్లాడాల్సి వస్తే, టీడీపీ – వైసీపీ.. దొందూ దొందే. ఇప్పుడు అధికారంలో వున్న వైసీపీకి అస్సలు ప్రచార పిచ్చి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆ ప్రచార పిచ్చితోనే వందల కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తున్న వైనం నిత్యం చూస్తూనే వున్నాం.
దీనికి తోడు, వైసీపీ బహిరంగ సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బొమ్మల్ని పెట్టి ఉన్మాదులైన వైసీపీ కార్యకర్తలతో వాటిని ధ్వంసం చేయిస్తున్న మూర్ఖత్వాన్ని ఏమనాలి.? ప్రచార పిచ్చికి పరాకాష్ట అనాలా.? పైశిచాకత్వానికి పరాకాష్ట అనాలా.?