జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో, సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం వున్న టీడీపీని నిలబెట్టాం.. అని పవన్ కళ్యాణ్ అనడం కూడా టీడీపీలో కొందరికి నచ్చలేదన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాటల యుద్ధం ఇరు పక్షాల నుంచీ నడిచింది.
సోషల్ మీడియాలో ‘రీచ్’ కోసం కొందరు ఈ తరహా రచ్చకి ప్రాధాన్యతనిస్తుంటారన్నది బహిరంగ రహస్యం. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, వైసీపీ పెయిడ్ మాఫియా, ఇటు జనసేన ముసుగులో అటు టీడీపీ ముసుగులో.. వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు ప్రయత్నించింది.
నిజానికి, జయకేతనం సభలో టీడీపీ గురించి జనసేన నేతలంతా పాజిటివ్‌గానే మాట్లాడారు.. అధినేత పవన్ కళ్యాణ్ సహా.! కలిసి నడుస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నాం.. అనే చెప్పుకుంటూ వచ్చారు ఆయా ప్రసంగాల్లో.
సో, జనసేన అధినాయకత్వానికి స్పష్టత వుంది. అలాగే, టీడీపీ అధినాయకత్వానికీ స్పష్టత వుంది. చంద్రబాబు, లోకేష్ కూడా, ‘జయకేతనం’ బహిరంగ సభకి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక, తాజాగా నారా లోకేష్, ‘పవనన్న గాజు గ్లాసులో టీ ఇవ్వొచ్చు కదా..’ అంటూ ఓ సందర్భంలో సందర్భోచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో, టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ అనేది అస్సలేమీ లేదనే విషయం స్పష్టమైపోయింది. జయకేతనం బహిరంగ సభలో కూడా, కూటమిలోని మూడు పార్టీల మధ్యా సఖ్యత వుందనీ, సోషల్ మీడియాలో ఎవరూ హద్దులు దాటి వ్యవహరించొద్దని సున్నిత హెచ్చరికల్ని జనసేన అధినాయకత్వం చేయడం చూశాం.
కూటమి అన్నాక, చిన్న చిన్న మనస్పర్ధలు మామూలే. గోతికాడ నక్కలా వైసీపీ అవకాశం కోసం ఎదురుచూస్తున్న దరిమిలా, కూటమి పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలూ ఒకింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంది.