TDP Janasena Alliance: 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల ఊహాగానాలు గత కొద్ది కాలంగా చాలా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటాయన్నది ఓ చర్చ. అయితే, వీళ్ళిద్దరి విషయంలో అత్యుత్సాహం చూపుతున్నది వైసీపీ.!
టీడీపీ – జనసేన కలవకూడదని వైసీపీ భావిస్తోంది. అందుకే, ‘దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్యండి..’ అంటూ వైసీపీ నేతలు.. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి సాధారణ నాయకుల వరకు.. నానా హంగామా చేస్తున్నారు.. హైరానా పడుతున్నారు. టీడీపీ – జనసేనకు లేని ‘పొత్తు’ తొందర, వైసీపీకి ఎందుకు.? అంటే, అదంతే.!
నవ్విపోదురుగాక మాకేటి.? అన్న చందాన వైసీపీ నేతలు, పదే పదే టీడీపీ – జనసేన పొత్తు గురించే మాట్లాడుతూ వస్తున్నారు. ఈ హంగామా ఇలా వుంటే, ఇంకోపక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు వచ్చిన అనుకూల పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కొత్త ఉత్సాహం ప్రదర్శిస్తోంది.
‘మొత్తంగా అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న చూచాయిగా వ్యాఖ్యానించారు. నేరుగా ఈ మాట ఆయన అనలేదుగానీ, ఆయన మాటల్లోని అర్థం అదే. ‘మంచిది, జనసేనకు ఓ తలనొప్పి తగ్గింది..’ అంటూ జనసైనికులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
కాగా, 2024 ఎన్నికలకు సంబంధించి 125 స్థానాల మీద టీడీపీ పూర్తి ఫోకస్ పెట్టనుందట. మిగతా 50 స్థానాల సంగతేంటి.? అంటే, అవి జనసేనకు వదిలేస్తుందట. అలాగని రెండు పార్టీల మధ్యా పొత్తు వుండదట. కేవలం అవగాహన మాత్రమే వుంటుందట. ఇదో కొత్త నాటకం టీడీపీ వైపు నుంచి అనుకోవచ్చా.?
టీడీపీలో కొందరు అత్యుత్సాహంతో ఇలాంటి లీకులు ఇస్తున్నారు. అధినేత అనుమతి లేకుండా ఇలాంటి లీకులు బయటకు వచ్చే అవకాశమే లేదు. మరి, జనసేన ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో ఏమో.!