ఔను, తెలుగు దేశం పార్టీకి వేరే శతృవులు అక్కర్లేదు. టీడీపీ అను‘కుల’ మీడియా, టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, టీడీపీకే చెందిన కొందరు కుహనా మేథావులు.. వీళ్ళు చాలు.. తెలుగు దేశం పార్టీ సర్వనాశనమైపోవడానికి.
వైసీపీ కంటే ఎక్కువగా పైన చెప్పుకున్న ఓ మూక, టీడీపీని అదఃపాతాళానికి తొక్కేసే పనిలో చాలా చాలా బిజీగా వుంది. లేకపోతే, సోషల్ మీడియా వేదికగా ‘స్పేస్’లు పెట్టి మరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడమేంటి.? అలా నినదిస్తున్నవారిలో, కొందరు ‘అధికార ప్రతినిథులు’ కూడా వుండటమేంటి.?
ఎవరో ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా, ఇంకో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తే, అలా లీక్ చేసిన సమాచారం నిజమైనదో కాదో కూడా చెక్ చేసుకోకుండా స్పేస్‌లు పెట్టి, ప్రభుత్వం నుంచే సమాచారం లీక్ అయ్యిందంటూ సుదీర్ఘంగా స్పేస్‌లు నడిపారు టీడీపీ కార్యకర్తలు.
చిత్రంగా ఈ స్పేసుల్లో టీడీపీ అధికార ప్రతినిథులు కూడా పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలే కాదు, బీజేపీ మద్దతుదారులు కూడా ఇలా స్పేసుల్లో హడావిడి చేశారు. ఇదంతా, ఓ జనసేన మద్దతుదారుడిపైన గుస్సా అవుతూ చేసిన హడావిడి.
వైసీపీ అయితే, తమ అధికారిక హ్యాండిళ్ళ ద్వారా ఆ సోషల్ మీడియా పోస్టుపై రచ్చ రచ్చ చేస్తోంది. వైసీపీతో పాటు టీడీపీకి చెందిన కొందరు, బీజేపీకి చెందిన కొందరు సోషల్ మీడియా బ్యాచ్.. ఈ మొత్తం రచ్చని తారాస్థాయికి తీసుకెళ్ళారు.
సోషల్ మీడియాలో ఎవరైనా వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తే అది ముమ్మాటికీ నేరమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, అలా లీక్ అయ్యిందని చెప్పబడుతున్న సమాచారం నిజమా.? కాదా.? అన్నది తేలకుండానే ఈ రచ్చ దేనికి సంకేతం.? పైగా, ప్రభుత్వంలో వుండీ.. ఈ అవనసరమైన నాన్సెన్స్ చేయడమేంటి.?
అన్నిటికీ మించి, వైసీపీకి టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వంత పాడటం.. ఆశ్చర్యకరం. జనసేన మాత్రమే అధికారంలో వుందా.? ఆ జనసేన పైకి విపక్షాలుగా వైసీపీ, టీడీపీ, బీజేపీ.. దూసుకెళుతున్నాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి పరిస్థితుల్ని చూస్తోంటే.
వైసీపీ, బీజేపీ సంగతి పక్కన పెడితే, సోకాల్డ్ టీడీపీ కార్యకర్తల కారణంగా టీడీపీకి తీరని నష్టం కలుగుతోంది. అందుకే, టీడీపీకి వేరే శతృవులు అక్కర్లేదనేది.!