ఓ వైపు ప్రభుత్వం పరంగా, ఇంకో వైపు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ, కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై కన్నెర్ర జేస్తోంది. గత వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూపీ లాగుతున్న సంగతి తెలిసిందే.
కూటమి అధికారంలోకి వచ్చాక కూడా జగన్ మాఫియా, కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాకి పాల్పడుతుండడాన్ని టీడీపీ, జనసేనతోపాటు కూటమిలో మరో భాగస్వామి అయిన బీజేపీ కూడా సీరియస్‌గా తీసుకుంది.
కూటమి ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఇప్పటికే పలు దఫాలు కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. మరోపక్క, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే, సముద్రంలోకి వెళ్ళి మరీ, జరుగుతున్న రేషన్ మాఫియాపై ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయ్యింది. పోర్టు ఆస్తుల కబ్జాపై ఉద్యమానికి సిద్ధమైంది టీడీపీ. ఓ వైపు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూనే, ఇంకో వైపు, వైసీపీ హయాంలో పెచ్చుమీరిపోయిన రేషన్ మాఫియా వ్యవహారాన్ని జనానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తోంది.
కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ వాటాదారులైన కేవీ రావు, జీఎంఆర్‌ల మెడపై కత్తి పెట్టి 6 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కేవలం 506 కోట్లకే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ అయిన అరబిందో పేరుపై జగన్ మాఫియా రాయించుకున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది.
గత వైసీపీ హాయంలో కాకినాడ పోర్టు నుంచి 49 వేల కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందన్నది టీడీపీ ఆరోపణ. ప్రైవేటు ఆస్తులు సైతం అన్యాక్రాంతమయ్యాయని టీడీపీ అంటోంది. ఈ నేపథ్యంలో జగన్ మాఫియా ముఠాపై కేవీ రావు ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీ నమోదు చేసిన కేసు గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
చెన్నయ్‌కి చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ మరియు ముంబైకి చెందిన మరో ఆడిట్ సంస్థతో కాకినాడ సీపోర్టుపై తప్పుడు ఆడిట్ లెక్కల్ని జగన్ సర్కారు రాయించిందనీ, తద్వారా వెయ్యి కోట్ల రూపాయల పన్నుల్ని ఎగ్గొట్టినట్లు ఆడిట్ రిపోర్టు సృష్టించారనీ, తద్వారా కేవీ రావుని బెదిరించారనీ, అలా బెదిరింపులకు దిగి సీపోర్టు కంపెనీ షేర్లని వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి పేరుతో రాయించుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
వైఎస్ జగన్ సైతం, విక్రాంత్ రెడ్డి చెప్పినట్లే చేయాలని కేవీ రావుకి సూచించారన్నది టీడీపీ ఆరోపణ. 10 వేల ఎకరాలున్న కాకినాడ సెజ్‌లో జీఎంఆర్ వాటా 51 శాతం కాగా, కేవీరావు 46 శాతం వాటా కలిగి వున్నారు. 2300 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మించాలని జీఎంఆర్ భావించి, 2019లో అప్పటి సీఎం చంద్రబాబుతో శంకుస్థాపన చేయించింది. బోగాపురం విమానాశ్రయం కాంట్రాక్టు టీడీపీ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కి రాగా, కాకినాడ సెస్‌లో వాటాను అరబిందోుకి ఇవ్వకపోతే బోాపురం కాంట్రాక్టు రద్దు చేస్తామని బెదిరించి, సెజ్‌ని వైసీపీ పెద్దలు తమ పేరున రాయించుకున్నారు.
సీఐడీ త్వరగా కేసు విచారణ పూర్తి చేసి, వైసీపీ మాఫియాపై చార్జి షీటు వేయాలనీ, అదే సమయంలో జగన్ మాఫియాపై పార్టీలకతీతంగా ప్రజలు నిరసన తెలపకపోతే ఎవరి ఆస్తులకూ రక్షణ వుండదని టీడీపీ చెబుతోంది.