రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం సాధారణమైన విషయం. నిత్యం ఏదో ఒకవిధంగా వారిపై బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో విషయం ఉందా లేదా అన్నది అనవసరం. వారిని ఇరుకున పెట్టామా లేదా అనేదే ముఖ్యం. తాజాగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపైనా టీడీపీ విమర్శలు చేయడం ఇందుకు నిదర్శనం. అక్రమంగా సంపాదించి దాచుకున్న సొమ్మును తెచ్చుకోవడానికే జగన్ విదేశాలకు వెళ్లారని ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో పలువురు నేతలు విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. గత కొంత కాలంగా పాదయాత్ర, ఎన్నికల ప్రచారంతో తీరికలేని షెడ్యూల్ తో గడిపిన జగన్ సైతం కాస్త సేద తీరేందుకు భార్యతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. వారం రోజులు పాటు ఆయన అక్కడే ఉండనున్నారు.
సాధారణంగా వేసవిలో ఎవరైనా చల్లటి ప్రదేశాలకే వెళతారు. మన దేశంలో అయితే ఊటీ, కొడైకెనాల్, సిమ్లా వంటి చల్లటి ప్రదేశాలు ఎంచుకుంటారు. అదే విదేశాలకు వెళ్లాలనుకుంటే మాత్రం స్విస్ నే ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈ వేసవి తాపం నుంచి విముక్తి పొందడానికి, కాస్త సేద తీరడానికి జగన్ స్విస్ వెళ్లారు. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా జగన్ న్యూజిలాండ్ వెళ్లారు. ఇదే తరహాలో ఇప్పుడు స్విస్ ఎంచుకున్నారు.
అయితే, ఈ విషయాన్ని కూడా టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకుని విమర్శలకు పదును పెట్టింది. జగన్ తన అక్రమ సొమ్మును తెచ్చుకోవడానికే స్విస్ వెళ్లారని టీడీపీ ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్ ఆరోపణలు గుప్పించారు. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. విహారయాత్రను కూడా రాజకీయం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. స్విట్జర్లాండ్ వెళితే బ్లాక్ మనీ తెచ్చుకోవడానికే అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అలా అనుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికి పలుమార్లు స్విస్ వెళ్లారని, అంటే ఆయన కూడా తన అక్రమ సంపాదన తెచ్చుకోవడానికే వెళ్లారా అని నిలదీస్తున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు అంటూ చాలాసార్లు ఆయన స్విట్జర్లాండ్ లో పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. గతేడాది చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా స్విస్ వెళ్లారని, అంటే.. ఎన్నికల్లో పంచాల్సిన డబ్బు తీసుకురావడం కోసమే ఆయన అక్కడకు వెళ్లారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి అంశాన్నీ ఇలా రాజకీయం చేయడం సబబు కాదని చెబుతున్నారు.
ఎన్నికలు ముగిసి, ఫలితాలు రావడానికి ఇంకా చాలా సమయం ఉందని, ఈలోగా కాస్త సేద తీరడానికే జగన్ స్విస్ వెళ్లారని స్పష్టంచేశారు. దాదాపు రెండేళ్లుగా తీరిక లేకుండా జనంతోనే మమేకమైన జగన్.. ఇప్పుడు సమయం దొరకడంతో టూర్ వెళ్లారన్నారు. దీనిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఏదో ఒక విధంగా జగన్ పై బురద జల్లాలనే కారణంతో ఇలా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
