తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి బీజేపీ సహకరించలేదంటూ టీడీపీ అను‘కుల’ మీడియా ఓ వాదనను తెరపైకి తెచ్చింది. నిజమేనా.? ఆ చర్చ కాస్సేపు పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది.?
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే దేశంలో జరిగే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఖరారైంది. ఆ లెక్కన, తెలంగాణలో కూడా జనసేన పార్టీకి టీడీపీ సహకరించి తీరాలి.
తెలంగాణలో జనసేన పోటీ చేసిన 8 సీట్లలో ఎన్ని గెలుస్తుంది.? అన్నది వేరే చర్చ. గెలుపోటముల్ని జనసేన పార్టీ ఒకేలా తీసుకుంటుంది. జనసేన దృష్టిలో గెలవడం అంటే, ప్రజల్ని గెలిపించడం. ఫక్తు రాజకీయ పార్టీల వ్యవహారం వేరు.
నిజానికి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. అలాంటప్పుడు, మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ ఆలోచనలు ఎలా వున్నా, జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి టీడీపీ సహకరించి తీరాలి. కానీ, సహకరించలేదు. ఒకవేళ సహకరించి వుంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇదొక బెటర్ ప్రాక్టీస్ అయి వుండేది.
మరీ ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేనకు టీడీపీ సహకరించి వుంటే, ఆ ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వుండేది. టీడీపీకి అది ఎడ్జ్ అయ్యేది కూడా. కానీ, టీడీపీ మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంది. టీడీపీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. బీజేపీ – జనసేన మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.
జనసేన – బీజేపీని విడదీస్తే మేలని టీడీపీ అను‘కుల’ మీడియా అనుకుంటోందిగానీ, అది టీడీపీకి ఇంకా పెద్ద దెబ్బ అవుతుంది.!