మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి.!
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ వివాదంలోకి కులాల కుంపట్లు కూడా దూసుకొచ్చాయి. చివరికి ఏం జరిగింది.? ‘ఆ వీడియో ఒరిజినల్ కాదు..’ అని పోలీసులు తేల్చేశారు. ఒరిజినల్ వీడియో ఎలా దొరుకుతుంది.? ఆ ఒరిజినల్ వీడియో దొరక్కపోతే, ‘కేసు క్లోజ్’ అంతేనా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
రాజకీయ నాయకులకు ఇలాంటి కేసులు కొత్తేమీ కాదు. ఈ తరహా కేసుల్లో రాజకీయ నాయకులకు శిక్ష పడటం అసాధ్యమన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ‘అసలు అది నేరమే కాదు’ అంటూ ఓ ‘ఛీరెడ్డి’ చేత చెప్పించేశారు. అత్యంత జుగుప్సాకరంగా ఆ ఛీరెడ్డి బరి తెగించేసింది. అధికార వైసీపీ దగ్గర ఇలాంటోళ్ళు ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. పేమెంట్ అందితే చాలు రంగంలోకి దూకేశారు.
ఇంకో సినీ ‘బులుగుసాని’ కూడా ఈపాటికే రంగంలోకి దిగాల్సి వుంది. ఆయనగారెందుకో ఈసారి రాజకీయ తెరపై కనిపించలేదు. ‘అయితే, తప్పేంటట.?’ అన్న స్థాయికి వైసీపీ నేతలు చాలామంది దిగజారిపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరంట్ల మాధవ్ అయితే, ‘మీక్కావాలంటే ఇంటికొచ్చి మీకు ఒరిజినల్ చూపిస్తా..’ అంటూ టీడీపీ అధినేతని బెదిరిస్తున్నాడు.
ఆ ‘పని’ చేశాడో లేదోగానీ, ఆరోపణలు వచ్చిన దరిమిలా, ఒకింత సిగ్గు పడాలి గోరంట్ల మాధవ్ అయినా.. ఇంకెవరైనా. కానీ, ప్చ్.. అలాంటివేమీ లేవు. పైగా, తానేదో ఘనకార్యం చేసినట్లు బుకాయిస్తున్నాడు. దాన్ని టీడీపీ ఎంజాయ్ చేస్తోంది. టీడీపీ రంకెలేస్తోన్న వైనం చూస్తోంటే, ‘ఛీరెడ్డి’ చెప్పిందే రైటేమో అనే స్థాయికి దిగజారి ‘సరిపెట్టుకోవాల్సి’ రావొచ్చు.
మొత్తంగా చూస్తే, ఈ వివాదం గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టిందట. అలాగని బులుగు బ్యాచ్ పండగ చేసుకుంటోంది. పార్టీ రంగు బులుగు.. అంతే కాదు, పార్టీలో నాయకుల చేష్టలు కూడా ‘బులుగు’ చేష్టలే అయిపోయాయన్నమాట. ఇంకనేం, ఇలాంటి వీడియోలు చూపించి, ఓట్లడుక్కుంటారేమో.. అని సోషల్ మీడియాలో నెటిజనం సెటైర్లేస్తున్నారు.