రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంశంపై శాసనమండలిలో అధికార కూటమి తరఫున టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను ఇప్పుడు తమపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ ఆరోపించింది. 2020లోనే ఎన్జీటీ ఆదేశాలతో రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయాయని, ఆ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు కౌంటర్ దాఖలు చేయలేదని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు సభలో స్పష్టం చేశారు. తమ పాలనలో ఆపిన పనులపై ఇప్పుడు ప్రశ్నించడం అన్యాయమని టీడీపీ నేతలు మండిపడ్డారు.
వైసీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయని టీడీపీ పేర్కొంది. హంద్రీనీవా పనులు వెడల్పు పేరుతో నిలిపివేశారని, జీఓ 365 తీసుకొచ్చి 102 సాగునీటి ప్రాజెక్టుల పనులు రద్దు చేశారని విమర్శించారు. గోరుకల్లు, గాలేరు–నగరి వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని, ఐదేళ్ల పాలనలో రాయలసీమకు బడ్జెట్‌లో 1 శాతం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్లక్ష్యం వల్ల రాయలసీమ ప్రజలు నష్టపోయారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీడీపీ వివరించింది. 20 నెలల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రూ.8 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు, తాజా బడ్జెట్‌లో మరో రూ.10,014 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. హంద్రీనీవా పూర్తి చేసి 190 రోజుల్లోనే 44 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతాలకు తరలించామని, ప్రస్తుతం ప్రాజెక్టులు, చెరువుల్లో 366 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. కేవలం 22 టీఎంసీల సామర్థ్యం ఉన్న రాయలసీమ లిఫ్ట్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అతిగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది.
ఎన్జీటీ ఆదేశాలతో ఆగిపోయిన పనులను తమపై మోపడం తగదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని వైసీపీ సభ్యులకు సూచించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధిని రాజకీయ అంశంగా మార్చకుండా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని సభలో టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.
