ముఖ్యమంత్రి వైఎస్ గజన్ మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి మీద విసుర్లు వేయడమేంటి.? ఒక్క క్షణం అంతా అవాక్కయ్యారు.. ఆ వీడియో చూసి. ఇంతకీ, ఆ వీడియో ఏంటి.? వీడియోలో ఎవరు ఏం మాట్లాడారు.? ఆ కథేంటి.?
టీడీపీ నేత పంచమర్తి అనురాధ ఓ వీడియో విడుదల చేశారు సోషల్ మీడియాలో. ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేసిన ఆ వీడియోలో, అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి మీద విరుచుకుపడ్డారు. దావోస్ వెళ్ళేది పబ్లిసిటీ స్టంట్లు చేయడం కోసమేననీ, దావోస్ ముసుగులో రహస్య పర్యటల్ని ముఖ్యమంత్రి చేస్తున్నారనీ, దోచుకున్నది దాచుకోవడానికే దావోస్ పేరుతో విదేశీ పర్యటనలనీ.. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనల మీద మండిపడ్డారు అంబటి.
అసలు విషయమేంటంటే, అంబటి రాంబాబు విమర్శించింది ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కాదు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీద. అద్గదీ అసలు కథ. సోషల్ మీడియా, రాజకీయ పార్టీలకు ఎలా ఉపయోగపడుతోందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా దావోస్ వెళ్ళకుండా, యూకే వెళ్ళారనీ.. అధికారిక పర్యటనలో అనధికారిక వ్యవహారాలనీ టీడీపీ అనుకూల మీడియా కోడై కూస్తున్న వేళ, అంబటి పాత విమర్శలు, ఇప్పుడు టీడీపీకి ఆయుధంగా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గడచిన మూడేళ్ళలో దోచుకున్నది దావోస్ పర్యటన పేరుతో విదేశాల్లో దాచుకునేందుకు విదేశాలకు వెళ్ళారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గతంలో ఇవే తరహా ‘సోషల్’ వ్యూహాల్ని వైసీపీ అమలు చేసింది. వాటినే, అచ్చంగా దించేస్తోంది టీడీపీ. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత.! నువ్వు నేర్పిన విద్యయే కదా.! ఇలాంటివన్నీ ఊరకనే చెప్పలేదు పెద్దలు.!
నోటికి ఏది వస్తే అది మాట్లాడారు గతంలో.. ఇప్పుడు ఆ మాటలు సరిగ్గా మీకే తగులుతున్నాయి.. నాడు – నేడు. నాడు అంబటితో చదివించి, సాక్షిలో రాయించిన స్క్రిప్ట్ నేడు మీ మెడకే.. pic.twitter.com/9DpKJKxksW
— PANCHUMARTHY ANURADHA (@AnuradhaTdp) May 20, 2022