ఇలాంటి ఓ సందర్భం రావడం అత్యంత బాధాకరం.! సినీ నటుడు నందమూరి తారక రత్నకి గుండె పోటు వచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర ప్రారంభమవుతూనే, ఆ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
వెంటనే తారక రత్నకి ప్రాథమిక వైద్య చికిత్స చేసి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆయనకి పల్స్ లేదని వైద్యులు చెప్పారు. కాస్సేపటికి సీపీఆర్ చేసిన తర్వాత మళ్ళీ పల్స్ అందిందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారక రత్నని బెంగళూరుకి తరలించారు.
తారక రత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. పలువురు టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు త్వరగా తారక రత్న కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ఇదంతా నాణేనికి ఓ వైపు. రాజకీయ విమర్శలు ఇంకో వైపు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తూనే, తారక రత్న గుండెల మీద పాదం మోపాడనీ.. ఆ దెబ్బకి తారక రత్నకి గుండె పోటు వచ్చిందనీ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. అంతే కాదు, నందమూరి కుటుంబానికి నారా వారి శాపం.. అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
సందర్భమా ఇది.? అక్కడ ఓ మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇలా ట్రోలింగ్ చేస్తున్నారంటే.. వాళ్ళసలు మనుషులే కాదు. నర రూప రాక్షసులు.. అనడం కంటే కూడా దారుణమైన పేరు ఏదో పెట్టాలి.
ఇక, మరో ముఖ్యమైన విషయం. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిగారి వ్యాఖ్యల వ్యవహారం. ‘తారక రత్న చనిపోతాడనుకున్నాం. కానీ, బాలయ్య రాకతో బతికేశాడు..’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయసేంటి.? ఆయన మాటలేంటి.? ఇదో మిరాకిల్.. అంటున్నారాయన. అంటే, వున్నపళంగా నందమూరి బాలకృష్ణని దేవుడ్ని చేసేశారన్నమాట గోరంట్ల బుచ్చయ్య చౌదరి.