సింగర్ మంగ్లీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమెపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అరసవల్లి ఆలయంలో జరిగిన రథ సప్తమి వేడుకలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెంట మంగ్లీ వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు దర్శనం ఏర్పాటు చేయడంపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున మంగ్లీ ప్రచారం చేసింది. జగన్ ను అనుకూలంగా పాటలు పాడింది. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే భవిష్యత్ చల్లగా ఉంటుందంటూ చెప్పింది.
ఆ వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తూ టీడీపీ తీవ్ర అసంతృప్తి తెలుపుతోంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చంద్రబాబుపై పాటలు పాడాలని మంగ్లీని టీడీపీ శ్రేణులు కోరారు. కానీ తన నోటి వెంట చంద్రబాబు పేరు ఉచ్ఛరించడానికి ఇష్టపడక మంగ్లీ రిజెక్ట్ చేసిందని టీడీపీ అప్పట్లో తీవ్ర ఆగ్రహం తెలిపింది. జగన్ ప్రభుత్వ హయాంలో మంగ్లీని టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానెల్ కు సలహాదారుగా కూడా నియమించడాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
అలాంటి మంగ్లీకి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు దర్శనం ఇప్పించడం ఏంటంటూ ఆగ్రహం తెలుపుతున్నారు. సీఎం చంద్రబాబుకు కనీస మర్యాద కూడా ఇవ్వని మంగ్లీకి ఇప్పుడు ఇంత మర్యాద ఇవ్వడం కరెక్ట్ కాదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.