వర్రా రవీంద్రా రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగిందా.? పోనీ, బోరుగడ్డ అనీల్ కుమార్‌ని అరెస్టు చేయగలిగిందా.? పోసాని కృష్ణమురళి విషయంలో ఏం చేయగలిగింది కూటమి ప్రభుత్వం.? లిస్ట్ తీస్తే, చాంతాడంత వుంటుంది.!
అదే, వైసీపీ పాలన రోజుల్ని గుర్తు చేసుకుంటే.. కూటమి నేతలే గగుర్పాటుకి గురవ్వాల్సి వస్తుంది. అప్పట్లో టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్నే కాదు.. బీజేపీ నాయకుల్ని కూడా వైసీపీ ప్రభుత్వం వెంటాడింది, వేటాడింది కూడా.!
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి విషయంలో వైసీపీ సర్కారు అనుసరించిన వైఖరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వయానా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే, వైసీపీ సర్కారు వల్ల బాధింపబడ్డారు. చెప్పుకుంటూ పోతే, ఇదో వ్యధ.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి విశాఖలో ఎదురైన చేదు అనుభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జనసేన నేత పంచకర్ల సందీప్ మీద హత్యాయత్నమే జరిగింది కాకినాడలో.! అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరులు, జనసేన వీరమహిళలపై హత్యాయత్నానికి పాల్పడిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అక్కడా ఇక్కడా అని కాదు.. రాష్ట్రమంతా రావణకాష్టంలా మారిపోయింది. బాధితుల మీదనే పోలీసులు కేసులు నమోదు చేయడం చూశాం. అమరావతిలో మహిళా రైతుల్ని పోలీసులు ఎంత కర్కశంగా రక్తమొచ్చేలా కొట్టారో చూశాం. వీటన్నటికీ కూటమి ప్రభుత్వం బదులు తీర్చుకోవాలా.? వద్దా.?
ఇది సగటు కార్యకర్తల ఆవేదన. కూటమి ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించలేం.. ఇదింతే.. అని ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా నిట్టూరుస్తున్నారు. వీళ్ళలో చాలామంది వైసీపీ సర్కారు బాధితులే కావడం గమనార్హం.
వైసీపీ కార్యకర్తలకు వైసీపీ హయాంలో న్యాయం జరిగింది.. వాళ్ళ కసి తీర్చుకున్నారు, కాలరెగరేశారు.. మరి, మన పరిస్థితేంటి.? అందుకే, కూటమి పార్టీల కంటే వైసీపీదే కక్ష పూరిత రాజకీయాల్లో పై చేయి.. అన్న భావన వ్యక్తమవుతోంది.