సార్వత్రిక ఎన్నికల్లో మట్టికరిచిన వైసీపీ, ఎమ్మెల్సీ ఎన్నికలో తన ఉనికిని చాటుకోవాలనుకుంటోంది. స్థానిక కోటాలో జరిగే ఈ ఎన్నికకు సంబంధించి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
తమకు అవసరమైనదానికంటే ఎక్కువ ఓట్లు వున్నాయనీ, బొత్స సత్యనారాయణ విజయం నల్లేరు మీద నడకేననీ వైసీపీ భావిస్తోంది. కానీ, రాజకీయం.. రాజకీయంలానే చెయ్యాలి కదా.! అందుకే, కూటమి పార్టీలు కూడా రాజకీయానికి తెరలేపాయ్.
ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు స్థానిక ప్రజా ప్రతినిథులు వైసీపీని వీడి, కూటమిలోని వివిధ పార్టీలు (ప్రధానంగా టీడీపీ, జనసేన)లో చేరిపోయిన సంగతి తెలిసిందే. దాంతో, స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి వణుకు మొదలైంది.
అయితే, ఇంతవరకు కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఖరారు కాలేదు. ఎందుకింత ఆలస్యం.? అంటూ కూటమి పార్టీలకు సంబంధించిన కింది స్థాయి క్యాడర్ గుస్సా అవుతోంది. కూటమి పార్టీల్లో చేరిన ఒకప్పటి వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిథులూ కొంత అయోమయంలో పడిపోతున్నారు.
మరోపక్క, అభ్యర్థి ఎంపిక విషయమై కూటమి పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టీడీపీ అభ్యర్థే ఎన్నికల బరిలో వుంటారనీ, ఆ అభ్యర్థికి కూటమిలోని మిగతా పార్టీలు మద్దతిస్తాయనీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అభ్యర్థి ఎంపిక విషయమై ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తయ్యిందని టీడీపీ అంటోంది.
కానీ, పోటీ కోసం తొలుత ముందుకొచ్చిన ఓ అభ్యర్థి, చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో, మరో అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వస్తోందన్న కోణంలో, టీడీపీ ఈ వ్యవహారాన్ని నాన్చుతూ వస్తోంది. ఇలాంటి విషయాల్లో ఆలస్యం అమృతం విషం.. అనే మాటని ప్రస్తావించుకోవాల్సి వుంటుంది.
కూటమి అభ్యర్థిని ఖరారు చేస్తే, ప్రచారం.. తదితర వ్యవహారాల్లో దూకుడు ప్రదర్శించడానికి వీలవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ హిట్ కొట్టి, ఎమ్మెల్సీ ఎన్నికలో ఏమాత్రం తేడా కొట్టినా.. అది కూటమికి ఎదురు దెబ్బే అవుతుంది. అదే సమయంలో, వైసీపీకి ఆక్సిజన్ అందినట్లవుతుంది.