Pawan Kalyan: విశాఖపట్నంలో వారాహి విజయ యాత్ర తాలూకు ప్రకంపనలు అధికార పక్షం వైసీపీకి గట్టిగానే తగిలాయ్.! ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని కూడా ఈ ప్రకంపనలు తాకుతున్నాయ్.! టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న విశాఖపట్నంలో ‘షో’ చేసేందుకు ప్రయత్నించారు. జనాన్ని గట్టిగానే సమీకరించారుగానీ, పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఇదిలా వుంటే, వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసే విషయమై తెలుగుదేశం పార్టీలో ‘మేధోమధనం’ గట్టిగానే జరుగుతోంది గత కొన్నాళ్ళుగా. ఈ మేధోమధనంలో, ‘సీఎం అభ్యర్థిత్వాన్ని జనసేనకే వదిలేస్తే ఎలా వుంటుంది.?’ అన్న ప్రశ్న తలెత్తిందట.
‘వైసీపీ దిగిపోవడమే రాష్ట్రానికి శ్రేయస్కరమని జనసేనాని చెబుతున్నారు. వైసీపీ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఈ మాట బలంగా వినిపిస్తోంది. వారిని ఆలోచింపజేస్తోంది. జనసేన పట్ల సింపతీ వేవ్ కూడా వర్కవుట్ అవుతోంది..’ అని కొందరు టీడీపీ సీనియర్ నేతలతోపాటు, యంగ్ జనరేషన్ టీడీపీ లీడర్స్ కూడా చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారట.
‘మన పాలన చూశారు.. ఆ పాలనకి వ్యతిరేకంగానే 2019 ఎన్నికల్లో జనం తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో, 2024 ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అవడం అంత తేలిక కాదు. గత అనుభవాల దృష్ట్యా.. మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే ఇబ్బందే..’ అనేది టీడీపీ నేతల అంతర్మధనంగా కనిపిస్తోంది.
‘జనసేనకు ఓ ఐదు పది సీట్లు వచ్చినా.. లాభపడినట్లే అవుతుంది. కానీ, మన పరిస్థితి అలా కాదు. యాభై లేదా అరవై సీట్లు వచ్చినా.. వాటిని ఆ తర్వాత నిలబెట్టుకోవడం కష్టం..’ అన్నది టీడీపీ నేతల భయం.
అదే, పవన్ కళ్యాణ్‌ని సీఎం అభ్యర్థిత్వం దిశగా ముందుకు నెట్టి, టీడీపీ గనుక జనసేనకు మద్దతిస్తే.. ఆ తర్వాత, అధికారాన్ని పంచుకోవడం గురించి ఆలోచించొచ్చన్నది టీడీపీలో జరుగుతున్న చర్చ అట. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ.. విశాఖలోనూ వారాహి విజయ యాత్ర జోరు నేపథ్యంలో.. టీడీపీలో ఈ మార్పు చోటు చేసుకోవడంలో వింతేముంది.?