‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా, నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలంటూ టీడీపీ నేతలు కొందరు, మీడియాకెక్కి ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవుతారంటూ, టీడీపీ అను‘కుల’ మీడియాలో కథనాలు వండి వడ్డిస్తున్నారు కూడా.
లోకేష్‌ని పొగుడుతూ, జనసేన మీద నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు కొందరు టీడీపీ మద్దతుదారులు. దాంతో, టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినాయకత్వం డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది.
‘పార్టీల అధినాయకత్వం స్థాయిలో నిర్ణయాలుంటాయి. అంతే తప్ప, మీడియాకెక్కి నోటికొచ్చిన ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవు..’ అంటూ టీడీపీ అధినాయకత్వం తమ శ్రేణులకు అల్టిమేటం జారీ చేసింది. ఇంతలోనే, మంత్రి టీజీ భరత్, ‘నారా లోకేష్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారు..’ అని ప్రకటించడం గమనార్హం.
అయితే, జరుగుతున్న పరిణామాల్ని జనసేన పార్టీ ఒకింత జాగ్రత్తగా గమనిస్తూ వస్తోంది. టీడీపీ నేతలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలపై స్పందించకూడదంటూ అదికార ప్రతినిథులకు జనసేన అధినాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం జనసేన వర్సెస్ టీడీపీ.. మాటల తూటాలు గట్టిగానే పేలాయ్.
ఎప్పుడైతే టీడీపీ అధినాయకత్వం నుంచి హెచ్చరిక ప్రకటన వచ్చిందో, దాంతో అప్పటిదాకా జనసేనపై విషం చిమ్మిన చాలా టీడీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మూగబోయాయ్. కొన్ని డీ-యాక్టివేట్ చేసేసుకున్నాయి కూడా.