చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ నేతలు ఎందుకు రచ్చకెక్కి ప్రకటనలు చేస్తున్నారు.?
ఈ విషయమై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా గుస్సా అవుతున్నారు. నారా లోకేష్ విషయమై హద్దులు దాటి ఎవరు వ్యాఖ్యలు చేసినా సహించేది లేదంటూ చంద్రబాబు, పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన తర్వాత కూడా, ‘నారా లోకేష్ కాబోయే సీఎం’ అంటూ టీడీపీ నేతలు కొందరు వ్యాఖ్యానించడం దేనికి సంకేతం.?
టీడీపీలో మళ్ళీ ఒకప్పటి ‘వెన్నుపోటు’ రిపీట్ కాబోతోందా.? ఈసారి చంద్రబాబుకే నారా లోకేష్ రాజకీయంగా వెన్నుపోటు పొడవబోతున్నారు.? ఈ ప్రశ్నలు వైసీపీ నుంచి వస్తున్నాయంటే, దానిక్కారణం టీడీపీలో ఓ వర్గం చేస్తున్న ఓవరాక్షన్ వల్లనే.
2024 ఎన్నికల్లో పాతాళానికి పడిపోయిన వైసీపీకి, టీడీపీలోని ఆ వర్గం జాకీలేసి పైకి లేపుతున్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. ‘జనసేన – టీడీపీ మధ్య తిట్ల ప్రవాహం చూస్తోంటే, జాలేస్తోంది. మరీ ముఖ్యంగా, పవన్ కళ్యాణ్‌ని టీడీపీ వాడుకుని వదిలేస్తున్న వైనం దారుణం.. లోకేష్‌ని ముందు పెట్టి, చంద్రబాబుని వెన్నుపోటు పొడుస్తున్నారు కొందరు నేతలు..’ అంటూ వైసీపీ నేతలు, మీడియా చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ నేతలు నిన్న మొన్నటిదాకా మీడియా చర్చల్లో మాట్లాడటానికే భయపడేవారు. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా మీడియా ముందుకొచ్చి జనసేననీ, టీడీపీనీ విమర్శిస్తున్నారంటే, ఈ రెండు పార్టీలపై జాలి ప్రదర్శిస్తున్నారంటే.. దానిక్కారణం, టీడీపీలోని ఆ వర్గమే.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలూ, టీడీపీని వెన్నుపోటు పొడుస్తున్నట్లే భావించాలి. మహాసేన రాజేష్ గురించి కొత్తగా మాట్లాడుకునేదేం లేదు.. ఆయన తీరే అంత. ఏ పార్టీలో వుంటే, ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తుంటాడాయన. మంత్రి టీజీ భరత్ సహా.. కొందరు టీడీపీ నేతలు ఓ వర్గంలా ఏర్పడి, చంద్రబాబుకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే పరిస్థితి ఎందుకొచ్చింది.? వైసీపీకి ఎందుకంత అవకాశమిస్తున్నారు.?
ఒక్కటి మాత్రం నిజం.. అంచనాలకి అందని రీతిలో డ్యామేజ్ జరిగిపోయింది. డ్యామేజ్ కంట్రోల్ అంత సులభం కాదు. తన చుట్టూనే ఇంత రచ్చ జరిగింది గనుక, ఈ వివాదానికి స్వయంగా నారా లోకేష్ ఫుల్ స్టాప్ పెట్టాల్సి వుంటుంది. మహాసేన రాజేష్, టీజీ భరత్ లాంటోళ్ళపై చర్యలు తీసుకునే బాద్యత కూడా లోకేషే తీసుకోవాల్సి వుంటుంది.