తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వైసీపీపై తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం, తప్పుడు ప్రచారాలు చేయడం, సమాజంలో విభేదాలు సృష్టించడం వైసీపీ అసలు లక్ష్యమని ఆరోపించింది. అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చేయకపోయినా, తాము చేసినట్లుగా అబద్ధాలు చెబుతారని, అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ముఠా పని అని టీడీపీ తీవ్రంగా మండిపడింది.
టీడీపీ నాయకులు విమర్శిస్తూ, ప్రజా వేదిక నిర్మాణ ఖర్చు పై అబద్ధాలు చెప్పి దానిని కూల్చివేయడం, హైకోర్టు తీర్పులపై న్యాయమూర్తులను దూషించడం, “పింక్ డైమండ్” అంటూ తప్పుడు కథలు సృష్టించడం వైసీపీ చరిత్రలో భాగమే అన్నారు. అంతేకాక, రాజకీయంగా లాభం కోసం కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించిన దారుణ చరిత్ర వైసీపీదేనని అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి – సంక్షేమం ఒకేసారి ముందుకు సాగుతుంటే, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలపై వైసీపీ విషప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపించింది. పెట్టుబడులు రాష్ట్రానికి రావడమే తమ కడుపు మంటగా భావించి, విశాఖలో ప్రముఖ కంపెనీలకు భూములు కేటాయిస్తే కూడా కోర్టుల్లో కేసులు వేయించడం, పెట్టుబడులను అడ్డుకోవడం వైసీపీ అసలు పని అని అన్నారు.
సోషల్ మీడియా ద్వారా కూడా వైసీపీ తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా చేస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనల వీడియోలు, ఫొటోలు మార్చి ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు ప్రచారం చేయడం, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని తప్పుడు వార్తలు పుట్టించడం వైసీపీకి సహజమైపోయిందని టీడీపీ పేర్కొంది.
మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ మండిపడింది. ఒక పాస్టర్ మరణాన్ని “హత్య”గా ప్రచారం చేసి మతపరమైన ఉద్రిక్తతలు రేపే ప్రయత్నం చేసిన వైసీపీ, తిరుమల, శ్రీశైలం వంటి పవిత్ర దేవస్థానాలపైనా విషప్రచారం చేస్తుందని ఆరోపించింది. ఆవుల మరణాలు, ప్రసాదంలో కీటకాలు ఉన్నాయంటూ అబద్ధాలు ప్రచారం చేసి దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు చేసినట్లు టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది.
ప్రకాశం బ్యారేజీ గేట్లు మొరాయించడాన్ని పెద్ద సమస్యగా చూపిస్తూ, విజయవాడ మునిగిపోతుందంటూ తప్పుడు కథలు పుట్టించడం, వరద సహాయక చర్యల ఖర్చును వందల కోట్లుగా చూపించడం వైసీపీ పనితీరు అని టీడీపీ ధ్వజమెత్తింది.
మొత్తానికి, రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి, సుఖసంతోషాలపై అసూయతో, ప్రతి అంశంలో తప్పుడు ప్రచారమే వైసీపీ అసలు ఎజెండా అని టీడీపీ ఘాటుగా విమర్శించింది. అబద్ధాలు, విషప్రచారం, దిగజారుడు రాజకీయాలకే కేరాఫ్ అడ్రస్ వైసీపీ అని టీడీపీ స్పష్టం చేసింది.
