ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు జనసేన, బీజేపీలకు కేటాయించగా మిగిలిన 3 సీట్లకు గాను టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించింది. టీడీపీ ముందు నుంచి వెనకబడిన వర్గాలను ఆదరిస్తుంది. తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా బీసీ, ఎస్సీ వర్గాలకు కేటాయించింది.
టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీకి కేటాయించేలా నిర్ణయించారు. అంతేకాదు వీరిని కూడా మూడు ప్రాంతాల నుంచి ఎంపిక చేయడం విశేషం. వీరిలో రాయలసీమలోని కర్నూలుకి చెందిన బీసీ నేత బీటీ నాయుడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఆయనతో పాటుగా పార్టీలో మొదటి నుంచి ఉన్న బీదా రవిచంద్రకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. వీరితో పాటు యువతను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు గాను ఎస్సీ సామాజిక వర్గం నుచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకి టీడీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది.
అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చేలా టీడీపీ పరిపాలన ఉంటుందని మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికను చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటికే జనసేన తరపున కొణిదల నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.