రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో దర్జీ కన్హయ్య కుమార్ దారుణ హత్య దేశంలో అలజడి రేపిన సంగతి తెలిసిందే. ఇద్దరు నిందితులు అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరుతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో హత్యతో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను నేడు జైపూర్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు ప్రాంగణంలో భారీగా ప్రజలు గుమిగూడారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే..
నిందితులను కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో వారిపై ప్రజలు దాడికి పాల్పడ్డారు. కన్హయ్యను అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు వీరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు జూలై 12 వరకూ ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.