వెబ్ మీడియా, యూ ట్యూబ్ ఛానల్ నిర్వహణ.. వెరసి, ఐ-డ్రీమ్ గురించి చాలామందికి తెలిసే వుంటుంది. సదరు సంస్థ వైసీపీ కనుసన్నల్లో నడుస్తుంటుంది. వైసీపీ హయాంలో, ఐ-డ్రీమ్ సంస్థ ఓ వెలుగు వెలిగింది. ప్రభుత్వంలో ఓ కీలక పదవి కూడా ఆ సంస్థ యాజమాన్యానికి దక్కింది.
వైసీపీ తరఫున, అప్పటి వైసీపీ ప్రభుత్వం తరఫున మీడియాకి ప్రకటనలు వెళ్ళాలంటే, అది ఐ-డ్రీమ్ సంస్థ అధినేత కనుసన్నల్లోనే జరిగేది. చాలా మీడియా సంస్థల్ని వైసీపీ వైపు తిప్పడానికి ఐ-డ్రీమ్ సంస్థ యాజమాన్యం తెరవెనుకాల చక్రం తిప్పడం ఓపెన్ సీక్రెట్.
ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆ ఐ-డ్రీమ్ సంస్థకు చెందిన యూ-ట్యూబ్ ఛానల్‌లో యాంకర్ భార్గవి ఇంటర్వ్యూ ప్రసారమైంది.. ఆ ఇంటర్వ్యూ చేసింది యాంకర్ స్వప్న.. ఆ ఇంటర్వ్యూ తాలూకు యూ ట్యూబ్ లింక్‌లో జుగుప్సాకరమైన థంబ్‌నెయిల్ వాడటం.
‘నా భర్త బతికే వున్నారు.. ఆయన అత్యంత కిరాతకంగా చంపబడినట్లు థంబ్‌నెయిల్ పెట్టారు..’ అంటూ వాపోయింది భార్గవి ఓ వీడియో విడుదల చేస్తూ, ‘స్వప్న అక్క.. ఏంటిది.?’ అంటూ అందులో ఆమె ప్రశ్నించింది కూడా.
స్వప్నకి భార్గవి బాగా తెలుసు. భార్గవికి స్వప్న కూడా బాగా తెలుసు. ఇద్దరిదీ సుదీర్ఘకాల పరిచయం. ఇద్దరూ యాంకర్లే. మరి, తోటి యాంకర్ మీద స్వప్న ఎలా ఇంతటి జుగుప్సాకరమైన థంబ్‌నెయిల్ పెట్టించగలిగింది.?
అబ్బే, స్వప్నకి ఏం సంబంధం లేదు.. ఆ థంబ్‌నెయిల్ పెట్టిన వ్యక్తిదే తప్పు.. సంస్థకి కూడా సంబంధం లేదు.. అంటే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి వుండదు.
నాణేనికి ఇంకో వైపు ఏంటంటే, వైసీపీ అధికారం కోల్పోయాక ఐ-డ్రీమ్ సంస్థ తన ఉనికిని కాపాడుకునే దుస్థితికి వచ్చేసింది. ఎందుకంటే, ప్రభుత్వం నుంచి ఆదాయం లేదు కదా.! ఈ క్రమంలోనే, ఇలా అడ్డదారిలో సంపాదనకి తెరలేపిందనే వాదనా లేకపోలేదు.
యూ ట్యూబ్ థంబ్‌నెయిల్స్, సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం అనేది చాలాకాలంగా జరుగుతున్నదే. కొన్ని ఛానళ్ళపై సెలబ్రిటీలు యాక్షన్ తీసుకోవడం కూడా చూస్తున్నాం. కానీ, ఐ-డ్రీమ్ లాంటి యూ ట్యూబ్ ఛానల్ మీద వేటు వేసేంత సీన్, భార్గవి లాంటి వ్యక్తులకు వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
జర్నలిస్టుగా సుదీర్ఘకాల అనుభవం వున్న స్వప్న, ఈ విషయంలో భార్గవికి క్షమాపణ చెప్పాలి.. ఐ-డ్రీమ్ సంస్థ నుంచి కూడా క్షమాపణ చెప్పించాలి.!
ఇక్కడ, ఇంకో విషయం ఏంటంటే. స్వప్న ఇంటర్వ్యూలు ఎలా వుంటాయో తెలుసు.. ఐ-డ్రీమ్ నుంచి ఎలాంటి నీఛపు వ్యవహారాలు నడుస్తాయో తెలుసు.. తెలిసీ, భార్గవి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు.? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
పబ్లిసిటీ స్టంట్ కాకపోతే, భార్గవి అలానే ఆమె భర్త.. నేరుగా ఐ-డ్రీమ్ ఛానల్ మీద లీగల్ యాక్షన్ షురూ చేయాల్సి వుంటుంది. ఇలాంటి ఛానల్స్, సభ్య సమాజానికి అత్యంత హానికరం. మీడియా ముసుగులో మాఫియా తరహా కార్యకలాపాలు నడిపేవాళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే.
ఔను, తప్పుడు రాతలు.. తీవ్రవాదం కంటే సీరియస్ వ్యవహారమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
కొసమెరుపేంటంటే, ఆర్మీ వాళ్ళకు తగిన గౌరవం ఇవ్వడంలేదంటూ గాయత్రి భార్గవి ఆవేదన వ్యక్తం చేయడం. ఆమె ఆవేదనలో వాస్తవం లేకపోలేదు. ఆర్మీ విషయంలో ఇంతటి జుగుప్సాకరమైన థంబ్‌నెయిల్ పెడితే, యాంకర్ స్వప్న నుంచి ‘క్షమాపణ’ ప్రకటన ఇప్పటిదాకా రాకపోవడం ఆశ్చర్యకరమే.
దిగజారుడుతనంలో కొత్త కోణం ఇది.! తెలుగు మీడియాకి పట్టిన తెగులుకి నిదర్శనమిది.!