పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కీ, టీడీపీ క్యాడర్‌కీ కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ క్యాడర్ వ్యూహాత్మకంగా టీడీపీ – జనసేన మధ్య పుల్లలు పెడుతోంది. చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద వివాదాలుగా మారుతున్నమాట వాస్తవం.
అయితే, ఎప్పటికప్పుడు ఈ గ్యాప్‌ని తగ్గించేందుకు జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూనే వున్నారు. మరోపక్క, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా, పిఠాపురంలో టీడీపీ – జనసేన కార్యకర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ని తగ్గించేందుకు తనవంతు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించడం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెంట వర్మ కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయితే, ప్రోటోకాల్ పేరుతో పోలీసులు, కొన్ని చోట్ల వర్మని నిలువరించే ప్రయత్నం చేయడం, టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తప్పింది. అయితే, ఇంకా వైసీపీ జాడ్యం వదలని కొందరు అధికారులే దీనంతటికీ కారణమని వర్మ ఆరోపిస్తున్నారు. టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ పెంచేందుకు పోలీస్ అధికారులు ‘ప్రోటోకాల్’ పేరుతో తనను, తన కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారని వర్మ ఆరోపిస్తుండడం గమనార్హం.
ఈ విషయమై హోంమంత్రి అనితకు వర్మ ఫిర్యాదు చేసే ఆలోచనలో వున్నారట కూడా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం, తన పర్యటనలో వర్మకి తగిన ప్రాధాన్యత వుండేలా చూసుకుంటూనే వున్నారు.
