లడ్డూ ప్రసాదం వైసీపీ హయాంలో కల్తీ అయ్యిందంటూ నడుస్తున్న వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ను కొనసాగిస్తూ, అదనంగా సీబీఐ నుంచి ఇద్దర్ని ఆ ‘సిట్’కి జోడించింది. సీబీఐ పర్యవేక్షణలో ఈ సిట్ తన కార్యకలాపాలు నిర్వహిస్తుందని సుప్రీం స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘సిట్’ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ‘సిట్’లో సమర్థులైన అధికారులే వున్నారనీ, వారి సమర్థత విషయంలో మరో మాట లేదని విచారణ సందర్భంలో న్యాయస్థానంలో కీలక అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
సిట్‌తో సీబీఐ అధికారుల్ని కలపడం పట్ల అభ్యంతరమేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు పేర్కొన్నారు. దీన్ని ‘స్వతంత్ర దర్యాప్తు బృందం’గా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ బృందంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి కూడా ఒకరు సభ్యులుగా వుంటారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానంలో లడ్డూ ప్రసాదం విషయమై విచారణ జరుగుతున్నందున తాత్కాలికంగా ‘సిట్’ విచారణ ఆగింది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం దిశా నిర్దేశంతో సిట్ బృందంలో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.
అంతిమంగా లడ్డూ నాణ్యత విషయమై భక్తుల్లో నెలకొన్న ఆందోళనకు పరిష్కారం దొరికితే, అంతకన్నా కావాల్సిందేముంది.? అయితే, గతంలో తయారైన లడ్డూల నాణ్యత విషయమై ‘సిట్’ ఎలాంటి దర్యాప్తు చేపడుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
మరోపక్క, లడ్డూ ప్రసాద నాణ్యత సహా, గడచిన ఐదేళ్ళలో టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై ‘సిట్’ విచారణ జరుపుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిన దరిమిలా, సర్వోన్నత న్యాయస్థానం సూచనతో రంగంలోకి దిగే సిట్, ఇతరత్రా అంశాలపై ఫోకస్ పెడుతుందా.? అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే