మీడియా మొఘల్, తెలుగుదేశం పార్టీకి ‘రాజగురువు’గా పిలవబడే రామోజీరావుకి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. చాలా ఏళ్ళుగా నలుగుతున్న మార్గదర్శి వివాదానికి సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రామోజీరావుపై మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే.
నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను మార్గదర్శి సంస్థ సేకరిస్తోందన్నది వుండవల్లి ఆరోపణ. అయితే, అప్పట్లో కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా ఈ కేసులంటూ ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, అలాగే తెలుగుదేశం పార్టీ తమ వాదనల్ని వినిపించడం చూశాం.
ఏళ్ళు గడచినా ఈ కేసులో విషయం ముందుకెళ్ళలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఈ కేసు మరింతగా నీరుగారిపోయింది. అయితే, హైకోర్టులో గతంలో రామోజీరావుకి ఊరట కలగడంపై ఉండవల్లి అరుణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు కూడా. ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ని కోరితే, సానుకూలంగా స్పందించారనీ, ఇంకా సుప్రీంకోర్టుని తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించకపోవడానికి కారణం తనకు తెలియదనీ చెప్పుకొచ్చారు వుండవల్లి అరుణ్ కుమార్.
చిత్రమేంటంటే, ఈ కేసులో రామోజీరావు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారని వుండవల్లి అరుణ్ కుమార్ చెబుతుండడం. గతంలో వచ్చిన తీర్పు తనకు అనుకూలంగా వున్నాగానీ, రామోజీరావు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఉండవల్లి అన్నారు. బహుశా పూర్తి ఊరట కోసం రామోజీరావు ప్రయత్నిస్తున్నారేమోనని ఉండవల్లి చమత్కరించారు.
ఎవరి మీదా రాజకీయ కోణంలో ఈ ఆరోపణలు చేయడంలేదనీ, మార్గదర్శి వివాదానికి సంబంధించి నిజానిజాలు బయటకు రావాలన్నదే తన ప్రయత్నమనీ వుండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. ఈ కేసులో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోగానీ, మరోమారు రామోజీ – మార్గదర్శి – ఉండవల్లి వివాదం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.