రాష్ట్రంలో జిఎస్ టి ద్వారా లభించే సేవింగ్స్ ను ప్రజలకు తెలియజేసే భారీ సభ అక్టోబర్ 16న కర్నూలులో జరగనుంది. ఈ సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగిస్తారు.
ప్రధాని మోడీ ఉదయం సున్నిపెంట వద్ద హెలీప్యాడ్ కు చేరుకుని, శ్రీశైలానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం కర్నూలు సమీపంలోని నన్నూరులోని రంగమయూరి గ్రీన్ హిల్స్ లో జరిగే సభలో పాల్గొంటారు. సభ అనంతరం మోడీ ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ ద్వారా డిల్లీకి బయలుదేరుతారు.
ఈ సభ విజయవంతం కావడానికి మంత్రి లోకేష్ అధ్వర్యంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ పై పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 98,985 అవగాహన కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించినట్లు వివరించారు.
విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు, రైతు కేంద్రాల్లో జిఎస్ టి ప్రయోజనాలపై ప్రజలకు వివరించారు. విద్యార్థుల కోసం వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ పోటీలు కూడా ఏర్పాటు చేశారు. కొత్త జిఎస్ టి విధానం వల్ల రాష్ట్రంలో ఆటోమొబైల్ అమ్మకాలు 33 శాతం పెరిగాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
దీపావళి సందర్భంగా అక్టోబర్ 16 నుండి 19 వరకు అన్ని జిల్లాల్లో గ్రాండ్ జిఎస్ టి షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని మంత్రుల బృందం సూచించింది.
