Chiranjeevi-Suhasini: తెలుగులో అత్యధిక సినిమాల శతదినోత్సవాలు జరిపిన హీరోగా మెగాస్టార్ చిరంజీవిదే రికార్డు. విజేత మొదలు ఎన్నో సినిమాలకు ఆయన అనేక పట్టణాలు, నగరాల్లో తన సక్సెస్ సినిమాలకు శతదినోత్సవాలు జరిపారు. గ్యాంగ్ లీడర్.. ఒకేరోజు హెలికాప్టర్లో ప్రయాణించి హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు నగరాల్లో శతదినోత్సవం నిర్వహించిన రికార్డు ఆయనకే సొంతం. ఇలాంటి రేర్ రికార్డు దేశంలో మరో హీరోకు లేదు. వేలాదిగా మెగాభిమానులు తరలివచ్చి విజయవంతం చేసేవారు. ఇటువంటి ఓ చిరంజీవి సినిమా వేడుకకు సంబంధించి ఓ సంఘటనను సన్నివేశంగా మలిచి ఏ సినిమాలో ఉపయోగించారో నటి సుహాసిని చెప్పుకొచ్చి తన అనుభవాన్ని పంచుకోవడం హైలైట్ గా నిలిచింది.
ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ భర్త మణిరత్నం తెరకెక్కించిన ‘ఇద్దరు’లో ఆ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. ‘80ల్లో చిరంజీవితో కలిసి నటించిన ఓ సినిమా ఘన విజయం సాధించింది. సినిమా శతదినోత్సవ వేడుకను తిరుపతిలో నిర్వహించారు. మొత్తం తిరుపతి ప్రజానీకం తరలివచ్చినట్టు ప్రాంగణం అంతా చిరంజీవిని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. అయితే.. వారందరికీ అభివాదం చేయడానికి చిరంజీవి టెర్రస్ పైకి ఎక్కారు. వెళ్తూ నువ్వు నా సహనటివి చూసేందుకు రమ్మని నన్ను కూడా తీసుకెళ్లారు. పైనుంచి చూస్తే ఎటుచూసినా జనమే. చిరంజీవి వారందరికీ అభివాదం చేయడం చూసి ఇదికదా స్టార్ పవర్ అనిపించింది’.
‘ఆ సన్నివేశం, ఆ ఫ్యానిజం నా మనసులో ఉండిపోయింది. దీనిని ఎలాగైనా ఓ సినిమాలో సన్నివేశంగా మలచాలని భావించా. సరిగ్గా కొన్నేళ్లకు మణిరత్నం ‘ఇరువర్’ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో మోహన్ లాల్ కోసం వచ్చిన ఫ్యాన్స్ ను ఇదీ స్టార్ పవర్ అని చూపేందుకు ప్రకాశ్ రాజ్ తీసుకెళ్లాలి. దీంతో ఆయన్ను బిల్డింగ్ పైకి తీసుకెళ్లి చూపిస్తారు ప్రకాశ్ రాజ్. ఎంతో పేరొచ్చిన ఆ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కి నేను చూసిన చిరంజీవి ఫ్యానిజం సన్నివేశమే స్ఫూర్తి’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు ఆ సినిమాను రాక్షసుడు లేదా చాలెంజ్ అనుకుంటున్నారు. మొత్తంగా సుహాసిని కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కి ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తోంది.
