కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ ఆమె తల్లిదండ్రులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనకు తొమ్మిదేళ్లు గడిచినా కేసు విచారణలో పురోగతి కనిపించడంలేదని వారు ఆరోపించారు.
సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సుగాలి పార్వతి, రాజు నాయక్ తాజాగా జగన్‌ను కలిసి కేసు పరిస్థితిని వివరించారు. తమ కుమార్తెపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసినప్పటికీ, ఇప్పటివరకు నిందితులకు శిక్ష పడలేదని వాపోయారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేసును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, తమ కుటుంబానికి అండగా నిలిచిందని వారు గుర్తుచేశారు. కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కేసు విచారణ పూర్తిగా నెమ్మదించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఐ విచారణ కూడా ఆశించిన వేగంతో సాగడం లేదని, హైకోర్టులో కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఈ కేసుపై గళమెత్తిన నాయకులు ఇప్పుడు స్పందించడం లేదని వారు విమర్శించారు.
తమకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.
