ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2026లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మేఘా కృష్ణారెడ్డి భార్య సుధా రెడ్డి ధరించిన విలాసవంతమైన డైమండ్ నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నెక్లెస్ విలువ ఏకంగా రూ.142 కోట్లు అని ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి ఆమెపై పడింది.
ఈసారి మెట్ గాలాలో సుధా రెడ్డి ప్రత్యేకంగా డిజైన్ చేసిన సంప్రదాయ-ఆధునిక కలయిక దుస్తులతో హాజరయ్యారు. ఆమె లుక్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది అరుదైన భారీ తాంజనైట్ రాయితో రూపొందించిన నెక్లెస్. బ్లూ-వైలెట్ రంగులో మెరిసే ఈ అరుదైన రాయిని ప్రపంచంలోనే అత్యంత విలువైన తాంజనైట్ స్టోన్లలో ఒకటిగా చెబుతున్నారు. విక్టోరియన్ స్టైల్‌లో డైమండ్లతో రూపొందించిన ఈ ఆభరణం విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.142 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
నెక్లెస్‌తో పాటు భారీ ఎమరాల్డ్ రింగ్, పోల్కీ డైమండ్ రింగ్స్ కూడా ఆమె ధరించారు. ఇవన్నీ ఆమె వ్యక్తిగత కలెక్షన్‌లోని ప్రత్యేక ఆభరణాలేనని తెలుస్తోంది. ఇతర అంతర్జాతీయ సెలబ్రిటీల మాదిరిగా బ్రాండ్ల నుంచి అప్పుగా తీసుకోకుండా స్వంత కలెక్షన్‌తో హాజరుకావడం కూడా ప్రత్యేక చర్చకు దారి తీసింది.
సుధా రెడ్డి ధరించిన ప్రత్యేక డ్రెస్‌లో భారతీయ కళా సంప్రదాయాల ప్రతిబింబం కనిపించింది. కలంకారీ కళాశైల ప్రభావంతో రూపొందించిన ఆ డ్రెస్‌లో కల్పవృక్షం, పక్షులు, పూల డిజైన్లు, సూర్య చంద్రుల మోటిఫ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ దుస్తులను తయారు చేయడానికి పలువురు కళాకారులు వేల గంటలు శ్రమించినట్లు సమాచారం.
ఇప్పటికే గతంలో కూడా మెట్ గాలాలో సుధా రెడ్డి హాజరై తన లగ్జరీ లుక్‌తో వార్తల్లో నిలిచారు. ఈసారి మాత్రం రూ.142 కోట్ల నెక్లెస్ కారణంగా ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మరింతగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో “హైదరాబాద్ గ్లామర్ గ్లోబల్ స్టేజ్‌పై మెరిసింది”, “ఇండియన్ లగ్జరీకి కొత్త గుర్తింపు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
