Pushpa 2: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శనలో అపశృతి జరిగింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య ధియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళ, బాలుడు సొమ్మసిల్లి పడిపోయారు. సినిమా ప్రదర్శనకు హీరో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన్ను చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపడంతో తొక్కిసలాట జరిగింది.
ధియేటర్ వద్ద పోలీసులు బందోబస్తు ఉన్నా భారీగా ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. ఈక్రమంలో మహిళ, ఇద్దరు బాలుడు తొక్కిసలాటలో ఇరుక్కుపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడికి పోలీసులు సీపీఆర్ చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. మరో బాలుడికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మహిళను కూడా ఆసుపత్రికి తరలించారు.
పరిమితికి మించి జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు హెచ్చరించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో దాదాపు సంధ్య ధియేటర్ వద్ద 200 మంది పోలీసులు మొహరించారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.