విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం శుభవార్త చెప్పింది. గతంలో విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టిన కేంద్రమే, ఇప్పుడు అదే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు నడుం బిగించడం గమనార్హం. అప్పుడూ నరేంద్ర మోడీ ప్రభుత్వమే, ఇప్పుడూ నరేంద్ర మోడీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో వుంది.
గతంలో, విశాఖ ఉక్కు అమ్మకం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు, విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన విలువైన భూముల అమ్మకం దిశగా అప్పటి వైసీపీ సర్కార్ ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ లేదా అమ్మకానికి వ్యతిరేకంగా జనసేన పార్టీ నినదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదని జనసేనాని తేల్చి చెప్పారు. మరోపక్క, టీడీపీ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించింది.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఏర్పాటు నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ అంశం కూడా మూడు పార్టీల అధినాయకత్వాల మధ్య చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కానీయబోనని జనసేనాని పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టేసిన సంగతి తెలిసిందే.
పొత్తు ధర్మాన్ని పాటించిన బీజేపీ అధినాయకత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా, కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకి నడుం బిగిస్తూ, కీలకమైన నిర్ణయం తీసుకుంది.
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడమే ఆ నిర్ణయం. ఈ ప్యాకేజీ విలువ సుమారు 17 వేల కోట్లుగా చెబుతున్నారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూటమి పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క, కూటమి సాధించిన ఈ విజయంపై విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కీ, ప్రధాని నరేంద్ర మోడీకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
అధికారంలో వుండగా, విశాఖ అంటే.. అమ్మకాలకి అనువైనది.. అనే భావనలో వుండేవారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు భూములపై వైసీపీ గద్దలు కన్నేయడం, ఆ అమ్మకాల దిశగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనలు వుండడం చూశాం.
కానీ, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యతను కూటమి తన భుజానికెత్తుకుని, పదిహేడు వేలు కోట్ల ప్యాకేజీతో, విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం వచ్చేలా చేస్తోంది.