డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు డిసెంబర్ 3న శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటివరకూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ విభాగాన్ని ఇకపై ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు.
‘దివ్యాంగుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి వారికి ప్రభుత్వం నుంచి సమర్ధ సేవలు అందించే అవకాశం ఉంటుంది. జిల్లాస్థాయిలోనూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి జిల్లాకో అధికారిని నియమిస్తారు. రెండు శాఖల మధ్య జిల్లాల్లో శాఖాపరమైన ఏర్పాట్లు చేయనున్నారు’ అని తెలిపారు.